శబరిమల ఆలయం భక్తుల కోసం మరోసారి తెరుచుకోనుంది. శుక్రవారం (అక్టోబర్ 16) నుంచి ఐదు రోజుల పాటు నెలవారీ కైంకర్యాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలాగే శబరిమల యాత్రకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు రానున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. కేరళ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 60 ఏళ్లు పైబడిన వారు, 10 సంవత్సరాల లోపు పిల్లలను యాత్రకు అనుమతించరు. గుండె సమస్యలతో బాధపడుతున్న వారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా శబరిమల యాత్రకు రాకూడదని స్పష్టం చేశారు. దర్శనానికి 48 గంటల ముందే కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. నెగటివ్‌ వచ్చిన వారినే అనుమతిస్తారు. ఇక కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో స్వామికి నెయ్యి అభిషేకాలు, పంపా నదిలో స్నానాలు, సన్నిధానంలో రాత్రి బస చేయడం లాంటి వాటిని నిషేధించారు.

శబరిమల యాత్ర మార్గదర్శకాలు:

* శబరిమలకు రాదలచిన భక్తులు ముందుగానే కేరళ పోలీస్‌ శాఖ అభివృద్ధి చేసిన వర్చువల్‌ క్యూ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్:https://sabarimalaonline.org

* వారాంతాల్లో రోజుకు 2000 మంది, ఇతర రోజుల్లో రోజుకు 1000 మంది చొప్పున భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. వెబ్‌సైట్‌లో ఈ మేరకే రిజిస్టర్‌ చేసుకునే వీలు కల్పించారు. పరిస్థితులను బట్టి మార్పులు ఉంటాయి.

* దర్శనానికి 48 గంటల ముందు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అందులో నెగటివ్‌ వచ్చిన వారినే దర్శనానికి అనుమతిస్తారు. ప్రవేశమార్గంలోనూ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

* స్వామికి నెయ్యి అభిషేకాలు, పంపా నదిలో స్నానాలు, సన్నిధానంలో రాత్రి బస చేయడం లాంటి వాటిని అనుమతించరు.

* కేవలం ఎరుమేలి, వడసెర్రికర మార్గాల్లో మాత్రమే అయ్యప్ప భక్తులను అనుమతిస్తారు. మిగతా అన్ని మార్గాలను తాత్కాలికంగా మూసివేస్తారు.

* 10 ఏళ్ల లోపు పిల్లలు, 60 సంవత్సరాలు నిండిన వారిని దర్శనానికి అనుమతించరు. గుండె సమస్యలు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా శబరిమల యాత్రకు రాకూడదు.

* యాత్రకు వచ్చిన వాళ్లు తమతో ఆయుష్మాన్‌ భారత్‌, బీపీఎల్‌ తదితర ఆరోగ్య బీమా కార్డులను వెంట తెచ్చుకోవాలి.

ఈ మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో ప్రచురించి, అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్‌ మెహతా కోరారు. ఈ మేరకు గురువారం (అక్టోబర్ 15) ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌‌తో శబరిమల యాత్రను కొన్ని నెలల పాటు నిలిపివేశారు. ఆ తర్వాత నిబంధనలు సడలించడంతో దర్శనాలకు అనుమతి ఇచ్చారు. అనంతరం కరోనా కేసులు మళ్లీ పెరగడంతో వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత పలు నిబంధనలతో యాత్రకు అనుమతు ఇస్తున్నారు. కేరళలో తగ్గినట్టే కనిపించిన కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. దేశంలో తొలి కేసు ఇక్కడే నమోదైన సంగతి తెలిసిందే. అయితే.. కేరళ ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. కానీ, లాక్‌డౌన్ సడలింపుల అనంతరం ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారు కేరళకు తిరిగి రావడంతో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు స్వీయ నియంత్రణ పద్ధతులు పాటించడం తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి: