మానవ జన్మ మనం ఎన్నుకున్నది కాకపోయినా (నిజానికి లోతుగా ఆలోచిస్తే అది మనం ఎన్నుకున్నదే....కర్మ ఫలాల ఫలితంగా)- దాన్ని ఎలా జీవించాలనే విషయం, దేనికి ఉపయోగించుకోవాలనే విషయం, నిర్ణయం మన మేధా పరిధిలోనే ఉంది. అంత మంచి వెసులుబాటును మనం సవ్యంగా వినియోగించుకోలేకపోతే మనకంటే మూర్ఖులు మరెవరూ ఉండరు. ఈ లోకంలో లాభనష్టాలు, గెలుపోటముల ప్రసక్తి లేనిది కేవలం ఆధ్యాత్మిక రంగం మాత్రమే. ఒకే ఒక సంకల్పం, ఏకసూత్రం... స్వస్థానాన్ని, శాశ్వత ధామాన్ని చేరుకోవడం. పరమాత్మ పాదాల చెంత నిర్వికల్ప విశ్రాంతిని, శాశ్వత ఉపశాంతిని పొందడం.
మార్గం ఒకటే అయినా మార్గమధ్యాన్ని నిరాటంకం, కంటకరహితం చేసుకోవలసి ఉంది....మలుపులు, మారు మార్గాంతరాలు లేకపోయినా మన మనసు చేసిన మార్గ నిర్దేశాన్ని అనుసరిస్తూనే మన అడుగు వేయబోయే ...మన ముందరి భాగాన్ని ప్రయాణ సౌలభ్యంగా మలచుకోవలసి ఉంది. ...దాని ఉద్దేశం- రేపటి ప్రయాణికులకు సానుకూలం చేయడం కూడా అయిఉండాలి. ప్రతి మానవ ప్రయత్నానికీ అందరి శ్రేయస్సు కూడా లక్ష్యమై ఉండాలి. ఇదే మానవ జీవన ప్రయాణ ఉద్దేశం, భగవన్నిర్దేశం కూడా....నిజానికి తాను ఆత్మనని తెలుసుకునేవరకు- తాను ఒక్కడు కాదు, అనేకం, అనేకానేకం. తాను ఆత్మనని గ్రహించిన క్షణమైతే... ప్రతి అణువూ తానే. శ్రీరామకృష్ణులు అలాంటి ఆత్మభావంతో లయమైనప్పుడే పరమహంస కాగలిగారు....
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి