కార్తీక మాసం అనేది హిందూ సంప్రదాయాలలో అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో చేసే ప్రతి ఆరాధన, ప్రతి దీపారాధన, ప్రతి జపతపాలు శివకేశవుల అనుగ్రహానికి కారణమవుతాయని పురాణాలు చెబుతాయి. ఈ మాసం ముగింపులో జరిగే ముఖ్యమైన పర్వాలలో పోలీ స్వర్గం ఒకటి.కార్తీక వ్రతాన్ని ఆచరించే మహిళలకు ఈ పండుగకు అపూర్వమైన ప్రాధాన్యం ఉంది.  భక్తిశ్రద్ధలతో ఉదయస్నానం చేసి, ఇళ్ల ముందు, దేవాలయాల వద్ద, పవిత్ర నదుల తీరాలలో దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలను పోలీ స్వర్గం రోజు ప్రత్యేక పూజలతో సాగనంపడం ఒక శతాబ్దాల నాటి ఆచారం.ఈ రోజున చేసే ఆరాధన, దానాలు, దీపదానం — ఇవన్నీ అక్షయ ఫలితాన్ని ఇస్తాయని విశ్వాసం. తెల్లవారుజామున మహిళలు పవిత్ర నదులలో స్నానం చేసి దీపాలను వదులుతారు. అనంతరం పోలీ స్వర్గం కథను శ్రవణం చేయడం ఈ పండుగలో అత్యంత ముఖ్యమైన భాగం. కథ విన్న తర్వాత శివాలయం సందర్శించి, దీపారాధన చేసి, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు.


పోలీ స్వర్గం కథ

అనగనగా ఒక గ్రామంలో ఒక చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్లు ఉండేవారు. కార్తీక మాసమంతా ఆమె ప్రతిరోజూ తెల్లవారుజామున తన ముగ్గురు కోడళ్లతో కలిసి నదికి వెళ్లి అక్కడ నదీస్నానం చేసి, దీపారాధన చేసి వస్తుండేది.అయితే చిన్న కోడలు పోలీపై మాత్రం ఇంటి మొత్తం పనులన్నీ వేసి, తాను ఎప్పుడూ నదికి తీసుకెళ్లేది కాదు. పాపం పోలీ హృదయంలో కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలి, దీపం పెట్టాలి అనే కోరిక ఉండేది. కానీ అత్తగారు ఎప్పుడూ తీసుకెళ్లకపోవడంతో, ఆమె ఆ కోరికను మనసులోనే దాచుకుని ఇంటిపనులు చేసేది.


కార్తీక మాసం చివరి రోజు — కార్తీక బహుళ అమావాస్య — వచ్చింది. ఆ రోజు కూడా అత్తగారు ఉదయాన్నే లేచి తన ముగ్గురు కోడళ్లతో నది పక్కకు వెళ్లిపోయింది. పోలీ మాత్రం, “ఈరోజైనా నేను తప్పకుండా దీపం పెడతాను” అని మనసులో నిర్ణయించుకుంది. ఇంట్లోని కవ్వము పక్కన అంటుకుని ఉన్న కొద్దిసేపటి వెన్నను తీసి, పెరటిలో పత్తిచెట్టుకు కింద రాలిన పత్తిని తీసి చిన్న వత్తి చేసి, బావిలో స్నానం చేసి ఆ వెన్నను నూనెగా ఉపయోగించి దీపాన్ని వెలిగించింది.అత్తగారు చూసేస్తుందేమోనని ఆ దీపం మీద ఒక చాకలి బానను మూతగా పెట్టి, తన భక్తిని దేవుడికి అర్పించింది.



అలా భక్తిశ్రద్ధలతో పెట్టిన ఆ ఒక్క దీపం ప్రభావంతో ఆకాశం నుండి దేవదూతలు ప్రత్యక్షమై పోలీ కోసం స్వర్గవిమానాన్ని తీసుకువచ్చారు. పోలీ ఆశ్చర్యంతో, ఆనందంతో ఆ విమానంలో ఎక్కి ప్రాణంతోనే స్వర్గానికి వెళ్లసాగింది. ఇదంతా నది ఒడ్డున దీపాలు పెడుతున్న ప్రజలు చూసి,“ఓహో! చాకలి పోలీ స్వర్గానికి వెళ్తోంది!” అని ఆశ్చర్యంతో పరవశించారు. అత్తగారు, ఆమె ముగ్గురు కోడళ్లు కూడా ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. “మా పోలీ స్వర్గానికి వెళ్తున్నదేమిటే?” అంటూ ఆకాశం వైపు చూడసాగారు. వాళ్లు కూడా పోలీతో పాటు స్వర్గానికి వెళ్లాలనుకుని ఆమె కాళ్లను పట్టుకుని గాలిలో ఊగసాగారు.



అప్పుడు స్వయంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై అత్తగారిని ఉద్దేశించి ఇలా అన్నారు:“నీవు నీ చిన్న కోడలిని విస్మరించి, భక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా రోజులు గడిపావు. కానీ పోలీ ఒక్క రోజు అయినా హృదయపూర్వకంగా దీపం వెలిగించింది. అందుకే నేను ఆమెను బొందితోనే స్వర్గానికి తీసుకుపోతున్నాను. నీకు స్వర్గానికి హక్కు లేదు. అడవులపాలై పొమ్ము!”అని శపించారు.కథను శ్రద్ధగా విని అక్షింతలు వేసుకుంటే, కార్తీక మాసమంతా చేసిన పఠనం, వ్రతం, దీపారాధన — ఈ సమస్తం పరిపూర్ణ ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ఓం శ్రీ కార్తిక దామోదరాయ నమః

మరింత సమాచారం తెలుసుకోండి: