2022 ఐపీఎల్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాలకే సరిపెట్టుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) 2023లో మాత్రం ఛాంపియన్‌గా నిలిచి అబ్బురపరిచింది. 2023 ఐపీఎల్ సీజన్ మొత్తం సీఎస్‌కే ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చింది. చెన్నై టీమ్‌లోని ప్రతి ఒక్క ఆటగాడి ప్రతిభను వెలికి తీయడంలో ధోనీ కీలక పాత్ర పోషించాడు. తక్కువ పారితోషికం పుచ్చుకున్న ఆటగాళ్లను కూడా స్టార్ క్రికెటర్లుగా తీర్చిదిద్ది వారి చేత రన్స్ చేయించాడు. వికెట్లు తీయించాడు. ధోనీ నేతృత్వంలో ధరకు మించిన పర్ఫామెన్స్ చూపించి ఔరా అనిపించిన ఆటగాళ్లెవరో ఇప్పుడు తెలుసుకుందామా మరి.

• డేవాన్‌ కాన్వే

గుజరాత్‌ టైటాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఓపెనర్ డేవాన్‌ కాన్వే 47 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అతడు జస్ట్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది 47 పరుగులతో జట్టుకు మంచి బూస్ట్ ఇచ్చాడు. ఇదొక్క మ్యాచ్‌లోనే కాదు ఈ సీజన్‌లో కాన్వే 16 మ్యాచ్‌లు ఆడితే 48.63 సగటుతో మొత్తంగా 672 రన్స్ చేశాడు. మ్యాచ్‌కి సగటున దాదాపు హాఫ్ సెంచరీ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సీజన్‌లో మంచి పెర్ఫామెన్స్‌ ఇచ్చి టీమ్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు.

* అజింక్య రహానె

అజింక్య రహానె 2023 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున ఆడాడు. దీనికి ముందు ఫామ్ లో లేక సతమతమైన ఈ ప్లేయర్ ఈ మ్యాచ్ల ద్వారా తన సత్తా ఏంటో చూపించాడు. ముంబయిపై 27 బంతుల్లో 61,  రాజస్థాన్‌పై 19 బంతుల్లో 31, బెంగళూరుపై 20 బంతుల్లో 37, కోల్‌కతాపై 29 బంతుల్లో 71 ఇలా భారీ స్కోర్ చేసి వావ్ అనిపించాడు. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన రహానె 326 రన్స్ చేసి కీలక ఆటగాడుగా నిలిచాడు. కాగా రహానె జస్ట్ రూ.50 లక్షలు తీసుకొని ఇంతటి మేటి పర్ఫామెన్స్ కనబరిచాడు.

వీరితో పాటు శ్రీలంకన్‌ ఫాస్ట్ బౌలర్ మతిశా పతిరన లసిత్ మలింగ స్టైల్‌లో బౌలింగ్‌ చేసి 12 మ్యాచ్‌లలో 19 వికెట్లను పడగొట్టాడు. ఈ టాలెంటెడ్ ప్లేయర్ రూ.20 లక్షలకే ఈ సీజన్ అంతా ఆడాడు. తుషార్ దేశ్‌పాండే 16 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసాడు. ఇంత మంచి పర్ఫామెన్స్ కనబరిచిన ఈ ప్లేయర్‌ను రూ.20 లక్షలకే సీఎస్‌కే కొనుగోలు చేసింది. ఇక మహీశ్ తీక్షణ 13 మ్యాచ్‌ల్లో 8.00 ఎకానమీతో 11 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్లేయర్ రూ.70 లక్షలు మాత్రమే పుచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl