ఇక బౌలింగే మా బలం అని నిన్న మొన్నటి వరకు విర్ర వీగిన ఆ జట్టు ఇప్పుడు బౌలింగ్ అంటే భయపడిన పరిస్థితి నెలకొంది. ఆసియా కప్ లో పాకిస్తాన్ బౌలింగ్ ను భారత్, శ్రీలంక చీల్చి చెండాడడం అందరికీ తెలిసినదే. ఇక తాజాగా వన్డే ప్రపంచకప్ లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచుల్లో కూడా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు పాకిస్థాన్ బౌలర్లను ఉతికారేశారు. మరీ ముఖ్యంగా షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ లాంటి బౌలర్లు ఆస్ట్రేలియాపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఆస్ట్రేలియాపై హారీస్ రౌఫ్ 9 ఓవర్లలో 97 పరుగులు సమర్పించుకుని కేవలం ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. షాదాబ్ ఖాన్ కూడా 10 ఓవర్లలో 68 పరుగులు సమర్పించుకున్నాడు. కీలక టోర్నీ ముందు పాకిస్థాన్ జట్టుకు ఇది చాలా డేంజర్ వాతావరణం అని చెప్పుకోవచ్చు.
కాగా బౌలింగే వారి ఆయుధం అనుకున్న తరుణంలో రెండు మ్యాచుల్లో కూడా అలా తడబడడం ఇపుడు ఆ జట్టుకి శాపంలాగా మారింది. షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, నసీమ్ షా త్రయం విడిపోవడంతో ఆ బౌలింగ్ లైనప్ వీక్ గా మారిందని క్రికెట్ పండితులు అంటున్నారు. ఇక 1974 మొదటి ప్రపంచకప్ మినహాయిస్తే.. ఆ తర్వాత వరుసగా 3 సార్లు సెమీస్ వరకూ వెళ్లింది పాక్ జట్టు. 1992లో ఛాంపియన్‌గా అవతరించగా, 1999లో రన్నరప్‌గా నిలిచారు. కానీ ఆ తర్వాత జట్టు ప్రదర్శన అంతకంతకూ పడిపోతూ వస్తుండడం అందరూ చూస్తున్న విషయమే. కాగా ఈ వరల్డ్ కప్ లో అక్టోబర్ 6న పాకిస్థాన్.. నెదర్లాండ్స్ తో తమ ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఇక వరల్డ్ కప్ లో అహ్మదాబాద్ గడ్డపై అక్టోబర్ 14న భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి