
మొదట ఆర్సీబీ పవర్ ప్లేలో దుమ్మురేపినా, జడేజా, పతిరాణ వంటి బౌలర్లు కట్టడి చేయడంతో స్కోరు నెమ్మదించింది. సాధారణ స్కోరుకే పరిమితమవుతుందేమో అనుకుంటున్న దశలో క్రీజులోకి వచ్చాడు షెపర్డ్. ఇక అక్కడి నుంచి మొదలైంది అసలు విధ్వంసం. ముఖ్యంగా సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్.. అతనికి పీడకలగా మిగిలిపోతుంది.
ఆ ఒక్క ఓవర్లోనే షెపర్డ్ ఏకంగా 33 పరుగులు పిండుకున్నాడు. ఇందులో నాలుగు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. ఒక నో బాల్‌ను కూడా సిక్సర్‌గా మలచడం అతని ప్రతాపానికి నిదర్శనం. ఈ ఊచకోతతో ఖలీల్ అహ్మద్ ఓవర్ ఐపీఎల్ 2025 సీజన్‌లోనే అత్యంత ఖరీదైన ఓవర్‌గా చెత్త రికార్డు మూటగట్టుకుంది. అంతకుముందు వైభవ్ సూర్యవంశిపై కరీం జనత్ ఇచ్చిన 30 పరుగుల రికార్డు బద్దలైంది. ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన చేస్తున్న ఖలీల్‌కు ఇది ఊహించని దెబ్బ.
ఖలీల్‌ను చిత్తు చేశాక షెపర్డ్ జోరు తగ్గలేదు. చివరి ఓవర్ వేసిన శ్రీలంక పేసర్ మతీశ పతిరాణ బౌలింగ్‌లోనూ మరో 20 పరుగులు బాదేశాడు. ఈ క్రమంలోనే కేవలం 14 బంతుల్లో తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇది ఐపీఎల్ 2025లో వేగవంతమైన హాఫ్ సెంచరీ కాగా, మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే ఇది సంయుక్తంగా రెండో వేగవంతమైన అర్ధ శతకం కావడం విశేషం.
ఈ సీజన్‌లో అంతకుముందు వైభవ్ సూర్యవంశి 17 బంతుల్లో ఫిఫ్టీ కొట్టడం ఒక సంచలనం అయితే, షెపర్డ్ అంతకంటే వేగంగా చెలరేగిపోయి ఐపీఎల్‌లో పరుగుల సునామీకి, రికార్డుల విధ్వంసానికి కొత్త అర్థం చెప్పాడు. షెపర్డ్ మెరుపులతో ఆర్సీబీ స్కోరు అమాంతం పైకి లేచింది. ఇలాంటి ఇన్నింగ్స్‌లే కదా ఐపీఎల్‌కు అసలైన మసాలా అని చెప్పవచ్చు.