
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్, ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించిన ఆర్సీబీ ఆటగాళ్లు విజయాన్ని సొంతం చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రజత్ పాటీదార్ మీడియాతో మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాటీదార్ మాట్లాడుతూ, ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆఖరి గెలుపు కోసం సిద్ధంగా ఉండండి. ఫైనల్ తర్వాత అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. చిన్నస్వామి స్టేడియమే కాదు, మేము ఎక్కడ ఆడినా అది మా హోమ్ గ్రౌండ్ లాగే అనిపిస్తుంది. అభిమానుల మద్దతు గొప్పగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా మా పట్ల చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు. వీ ఆల్ లవ్ యు అంటూ RCB అభిమానుల్లో జోష్ నింపారు.
ఈ మ్యాచ్‌లో బౌలింగ్ విభాగం తమ ప్రణాళికను చక్కగా అమలు చేసిందని పాటీదార్ చెప్పారు. ఫాస్ట్ బౌలర్లు పిచ్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. సుయాశ్ శర్మ బౌలింగ్ అద్భుతంగా ఉంది. అతడి లైన్ అండ్ లెంగ్త్, వికెట్లపై దృష్టి ఇవన్నీ ప్రత్యర్థులకు సమస్యగా మారాయి. బ్యాటర్లు అతడిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కెప్టెన్‌గా నేనేం చెప్పానో అతడికి బాగా తెలుసు. అతడిపై నమ్మకం ఉంది.. పరుగులు ఇచ్చినా మద్దతుగా నిలుస్తానని పేర్కొన్నారు.
ఇక బ్యాటింగ్ విభాగంలో ఫిల్ సాల్ట్ ప్రదర్శనపై పాటీదార్ ముచ్చటించారు. ప్రతి మ్యాచ్‌లో అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. పవర్‌ప్లేలో మంచి శుభారంభం ఇస్తున్నాడు. అతడి ఆటను డగౌట్ నుంచి చూడడం నాకు చాలా ఇష్టం. అతడు నా అభిమాన ఆటగాళ్లలో ఒకడు అని ప్రశంసలు కురిపించారు. చివరిగా, మేము చాలా ప్రాక్టీస్ చేశాం. కష్టపడ్డాం. ఇప్పుడు మా ముందు ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంది. అది గెలిచి టైటిల్‌ను అందుకోవాలి. అందరం కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అంటూ పటీదార్ వ్యాఖ్యలు ముగించారు. ఇలా గాని జరిగితే కోహ్లీతో పాటు పటీదార్ ను కూడా దేవుడిగా పరిగణించేలా ఉన్నారు ఆర్సీబి అభిమానులు..