ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్... హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ మధ్య జరిగిన ఓ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చకే దారితీసింది. శుక్రవారం న్యూ చండీగఢ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో, టాస్ సమయం నుంచే అసలు డ్రామా మొదలైంది.

టాస్‌కు ముందు, ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతా బాగానే ఉందనుకుంటున్న టైమ్‌లో, హార్దిక్ పాండ్యా షేక్‌హ్యాండ్ కోసం చేయి అందించగా, శుభ్‌మన్ గిల్ చూడనట్టుగా ముఖం తిప్పుకున్నాడు. బహుశా గమనించలేదేమో అని కొందరు అంటున్నా, కావాలనే చేశాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఏదో తేడా కొట్టిందనే గుసగుసలు మొదలయ్యాయి.

ఇక, గుజరాత్ టైటాన్స్ 229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఈ డ్రామా మరింత ముదిరింది. గుజరాత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే, ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. గుజరాత్ రివ్యూ తీసుకున్నా ఫలితం మారలేదు. గిల్ నిరాశగా మైదానం వీడుతుండగా, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం మామూలుగా కాకుండా, మరింత ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నాడు. అంతేకాదు, గిల్ పక్కనుంచి వెళ్తూ కూడా అతని వైపు చూడకుండా ముఖం పక్కకు తిప్పుకోవడం కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. ఇది వారి మధ్య వైరం ఉందన్న వార్తలకు మరింత ఆజ్యం పోసింది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, రోహిత్ శర్మ (81 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ను ముందుండి నడిపించాడు. జానీ బెయిర్‌స్టో కూడా కీలక పరుగులు జోడించడంతో, ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 228 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. బుమ్రా (1/27), బౌల్ట్ (2/56) తమ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్‌ను కట్టడి చేశారు. ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది.

గుజరాత్ టైటాన్స్ తరఫున సాయి సుదర్శన్ (28 బంతుల్లో 50 పరుగులు), వాషింగ్టన్ సుందర్ (48 పరుగులు) చివరి వరకు పోరాడారు. కుశల్ మెండిస్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా, శాంట్నర్ బౌలింగ్‌లో దురదృష్టవశాత్తు హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా పవర్‌ప్లేలో బౌలింగ్ చేసినప్పటికీ, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

ఫలితంగా, ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, క్వాలిఫయర్ 2కు దూసుకెళ్లింది. అక్కడ పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ ఓటమితో గుజరాత్ టైటాన్స్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచినప్పటికీ, హార్దిక్-గిల్ మధ్య నడిచిన ఈ వ్యవహారమే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా మొత్తం దీనిపైనే చర్చ జరుగుతోంది. 'ఏంటి వీరిద్దరి మధ్య కొత్త వైరం మొదలైందా?' అంటూ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు కథేంటో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: