బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శనతో కొత్త రికార్డు సృష్టించారు. ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్ చరిత్రలో నిలిచారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 387 బంతుల్లో 269 పరుగులు చేసిన గిల్, రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి శతకంతో మెరిశారు. ఈసారి ఆయన 130 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మొత్తం 349 పరుగులు చేసిన గిల్, సునీల్ గవాస్కర్ (344) లాంగ్ స్టాండింగ్ రికార్డును అధిగమించారు.

ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 87 పరుగులతో చక్కటి ఆరంభం ఇచ్చాడు. కెప్టెన్ గిల్ తో పాటు రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) ఉపయోగకర ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత్ మొత్తం 151 ఓవర్లలో 587 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ 3 వికెట్లు తీసినప్పటికీ భారత్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో స్టార్టింగ్‌లోనే వరుస వికెట్లు కోల్పోయింది. బెన్ డకెట్, ఓల్లీ పోప్, బెన్ స్టోక్స్ లు డకౌట్ అయ్యారు. అయితే హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) అద్భుతంగా పోరాడారు. కానీ మిగిలిన ఆటగాళ్లు తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో ఇంగ్లండ్ 407 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను చీల్చిచెందాడు. ఆకాష్ దీప్ 4 వికెట్లు తీసి తన టెస్టు కెరీర్‌లో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన చేశాడు.

భారత రెండో ఇన్నింగ్స్‌లోనూ గిల్ జోరు కొనసాగించారు. ఈసారి కేవలం 130 బంతుల్లోనే శతకం బాదారు. అతడికి సహకారంగా రిషభ్ పంత్ 65 పరుగులు చేశాడు. మరోసారి కెప్టెన్‌గా గిల్ నాయకత్వాన్ని బ్యాట్‌తో నిరూపించుకున్నాడు. ఈ టెస్టులో గిల్ చేసిన 269, 100* పరుగులు మొత్తంగా 349 రన్స్ భారత టెస్టు చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత రన్స్‌గా నిలిచాయి. ఆయనకు ముందు ఈ ఘనత గవాస్కర్ (344), లక్ష్మణ్ (340), గంగూలీ (330), సెహ్వాగ్ (319)ల చేతిలో ఉంది. ప్రస్తుతం గిల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో టీమిండియా భారీ ఆధిక్యంలో నిలిచింది. గిల్ నాయకత్వంలో జట్టు ఆత్మవిశ్వాసంగా కనిపిస్తోంది. ఈ విజయం గిల్ కెరీర్‌లో మైలురాయిగా నిలవనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: