
భారత క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన స్థాయికి చేరుకున్న ఆటగాళ్ల గురించి మాట్లాడితే, గతంలో గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ అనే పేర్లే ముందుగా వినిపించేవి. ఇప్పుడు ఆ సరసన నిలబడే తాజా పేరు శుభ్‌మన్ గిల్. అవును, కోహ్లీ రిటైర్మెంట్ దిశగా అడుగులు వేస్తున్న వేళ.. క్రికెట్ అభిమానులు, మార్కెట్ అంతా కొత్త క్రికెట్ హీరో కోసం ఎదురుచూస్తున్న సమయంలో, గిల్ ఆ ఖాళీని తనదిగా చేసుకుంటున్నాడు.
టెస్ట్ క్రికెట్‌లో తొలిసారి వెలుగులోకి వచ్చిన గిల్, వన్డేలు, ఐపీఎల్, తదుపరి అన్ని ఫార్మాట్లలోనూ తన సత్తా చాటాడు. ఊహించని స్థితిలో అతడికి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, అదే సమయంలో అతని ఫామ్ అద్భుతంగా మారిపోయింది. ఇంగ్లండ్‌తో సిరీస్ ప్రారంభమైన నాటి నుంచే గిల్ ప్రదర్శనలు ఆయనను క్రికెట్ మార్కెట్‌లో కొత్త స్టార్‌గా నిలిపాయి. టెస్ట్ ఫార్మాట్‌లో రెండు ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ బాదేయడం గిల్ సత్తాకు నిదర్శనం. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పుడు ఆ స్థాయికి చేరుకుంటున్నాడు.
గతంలో సచిన్ యుగం, ఆ తరువాత ధోనీ, విరాట్ యుగాలు మనం చూశాం. ఇప్పుడు ఆ లెజెండ్స్ మార్గంలోనే గిల్ సాగుతున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో టెస్ట్ క్రికెట్‌లో రాణించడం అంటే ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే. గిల్ ప్రస్తుతం అదే దిశగా పయనిస్తున్నాడు. ఇక బ్రాండింగ్ పరంగా కూడా గిల్ హవా కొనసాగుతోంది. ఐపీఎల్‌లో భారీ ధరకు ఒప్పందం, బీసీసీఐ ఏడాది కాంట్రాక్ట్‌లో రూ.5 కోట్లు ప్యాకేజ్, వివిధ యాడ్ బ్రాండ్స్‌తో జట్టు కావడం ఇవ్వన్నీ ఇప్పుడు అతని స్థానాన్ని పేర్కొంటున్నాయి. ఒక క్రికెట్ ఆటగాడు ఆటతో పాటు మార్కెట్‌ను కూడా ఆకట్టుకుంటే, అతడు పూర్తిస్థాయి క్రికెట్ ఐకాన్‌గా ఎదిగినట్టే.
ఈ తరుణంలో గిల్ చేతిలోని బ్యాట్ మాత్రమే కాదు భవిష్యత్తు భారత క్రికెట్ చరిత్రలో ఆయన పేరు ఎత్తగలిగే స్థాయిలో రాసుకుంటోంది. ఒక యుగానికి ముగింపు లాంటి ఈ దశలో, శుభ్‌మన్ గిల్ పేరుతో భారత క్రికెట్‌లో కొత్త యుగానికి ఆరంభం అనుకోవడం అతిశయోక్తి కాదు.