క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయేలా, కనీవినీ ఎరుగని రీతిలో వెస్టిండీస్ జట్టు కుప్పకూలింది. ఒకప్పటి క్రికెట్ సామ్రాజ్యపు శిథిలాలపై ఆస్ట్రేలియా పేసర్లు అంతిమ సంస్కారం నిర్వహించారు. కింగ్స్‌టన్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో కరీబియన్ జట్టు నమోదు చేసిన స్కోరు 27. ఇది అంకె కాదు.. వెస్టిండీస్ క్రికెట్ అభిమానుల గుండెల్లో గుచ్చుకున్న బాణం. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యల్ప స్కోరుతో ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్ల నిప్పుల వర్షానికి విండీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది.

తన వందో టెస్టును చిరస్మరణీయం చేసుకున్నాడు మిచెల్ స్టార్క్. పింక్ బాల్‌తో అతడు సృష్టించిన విధ్వంసం మాటలకు అందనిది. కేవలం 15 బంతుల్లోనే ఐదు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లతో చావుదెబ్బ కొట్టాడు. ఒక్క పరుగు కూడా చేయకుండానే విండీస్ మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత స్టార్క్ ప్రళయానికి లూయిస్, హోప్ కూడా బలయ్యారు. దీంతో 11 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి విండీస్ ఓటమి ఖాయం చేసుకుంది. కేవలం 9 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి స్టార్క్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

వెస్టిండీస్ బ్యాటర్ల స్కోరు కార్డు చూస్తే వారి నిస్సహాయత ఏంటో అర్థమవుతుంది. 0, 4, 0, 0, 0, 2, 11, 4*... ఇవి కొందరు బ్యాటర్లు చేసిన పరుగులు. జట్టులో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు సున్నాకే పెవిలియన్ చేరడం వారి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. జస్టిన్ గ్రీవ్స్ (11) ఒక్కడే రెండంకెల స్కోరు దాటాడు. స్టార్క్ దెబ్బకు తోడు, స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్‌తో విరుచుకుపడటంతో విండీస్ కథ కేవలం 87 బంతుల్లోనే ముగిసింది. బోలాండ్ వరుస బంతుల్లో గ్రీవ్స్, షమర్ జోసెఫ్, వారికన్‌లను ఔట్ చేసి ఆ జట్టును 26/9 స్కోరు వద్ద నిలిపాడు. మరో పరుగు చేసి టెస్టుల్లో అత్యల్ప స్కోరు (26) రికార్డును సమం చేసే ప్రమాదం నుంచి బయటపడినా, ఆ వెంటనే చివరి వికెట్ కోల్పోయి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు టెస్టుల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఒకవైపు ఆసీస్ సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు ఒకనాడు ప్రపంచాన్ని ఏలిన వెస్టిండీస్ క్రికెట్ భవిష్యత్తు అంధకారంలోకి జారుకుంది. ఈ ఓటమి వారిని రానున్న కాలంలో తీవ్రంగా వెంటాడటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: