మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంత‌వ‌ర‌కు భార‌త్ విజేత‌గా నిల‌వ‌లేక‌పోయింది. రెండుసార్లు (2005, 2017) ఫైన‌ల్‌కు చేరినా నిరాశే మిగిలింది. ఈసారి సొంత గ‌డ్డ‌పై ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగుతుండ‌టంతో భార‌త అమ్మాయిల‌కు క‌ప్ గెలిచే చారిత్ర‌క అవ‌కాశం ల‌భించినా, ఆస్ట్రేలియా రూపంలో అత్యంత క‌ఠిన‌మైన స‌వాల్ ఎదురైంది. క్రికెట్ చరిత్ర‌లో కంగారూల ఆధిప‌త్యం: పురుషుల క్రికెట్‌లో ఆస్ట్రేలియా జ‌ట్టు ఆరుసార్లు ప్ర‌పంచ‌క‌ప్ గెలిస్తే, మ‌హిళ‌ల క్రికెట్‌లో ఏడుసార్లు క‌ప్ నెగ్గి అత్యంత ప‌టిష్ట‌మైన జ‌ట్టుగా నిలిచింది. మొత్తం 12 ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో ఏడు ఆస్ట్రేలియా, నాలుగు ఇంగ్లండ్‌, ఒక‌టి న్యూజిలాండ్ ద‌క్కించుకున్నాయి. 2005 ఫైన‌ల్‌లో భార‌త్‌ను ఓడించింది కూడా ఆస్ట్రేలియానే.


ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టు సామ‌ర్థ్యం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్ లీగ్ మ్యాచ్ ఫ‌లిత‌మే ఉదాహ‌ర‌ణ‌. భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు 330 ప‌రుగులు చేసినా, ఆసీస్ మ‌హిళ‌లు ఏడు వికెట్లు కోల్పోయినా ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా 49 ఓవ‌ర్లలో 331 ప‌రుగులు చేసి గెలిచారు. పురుషులైనా, మ‌హిళ‌లైనా నాకౌట్ మ్యాచ్‌ల‌లో మ‌రింత ప‌క‌డ్బందీగా ఆడ‌టం ఆస్ట్రేలియ‌న్ల స్వ‌భావం. ముంబైలో కీల‌క సెమీఫైన‌ల్‌: ఈ నెల 30న ముంబైలో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు, ఆస్ట్రేలియాను ఢీకొన‌నుంది. లీగ్ ప‌నితీరు: లీగ్ ద‌శ‌లో ఏడు మ్యాచ్‌ల‌కు గాను ఆసీస్ ఆరు గెలిచి, ఒక మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో 13 పాయింట్ల‌తో టేబుల్ టాప‌ర్‌గా సెమీస్‌కు వ‌చ్చింది.

 

భార‌త జ‌ట్టు ఆరు మ్యాచ్‌ల‌లో మూడు గెలిచి, చివరి సెమీస్ బెర్తును ఆరు పాయింట్ల‌తో దక్కించుకుంది. ఆదివారం భార‌త్ బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డినా, పాయింట్ల ప‌ట్టిక‌లో మార్పు ఉండ‌దు. మ‌రో సెమీస్‌: ఈ నెల 29న ఇంగ్లండ్‌-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య గువాహ‌టిలో తొలి సెమీస్ జ‌ర‌గ‌నుంది. (ద‌క్షిణాఫ్రికా 10, ఇంగ్లండ్ 9 పాయింట్ల‌తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి). భార‌త్‌కు ఛాన్స్ ఉందా? సొంత గ‌డ్డ‌పై ఆడుతున్నందున మ‌న అమ్మాయిల‌కు ఈసారి ప్ర‌పంచ‌క‌ప్ గెలిచేందుకు మంచి అవ‌కాశం ఉంది. అయితే, టైటిల్ ఫేవ‌రెట్ ఆస్ట్రేలియాను సెమీస్‌లో ఎదుర్కోవ‌డ‌మే పెద్ద స‌వాల్‌. ప్ర‌తిభ‌లో ఏమాత్రం త‌క్కువ కాని భార‌త మ‌హిళ‌లు, ఆసీస్ జ‌ట్టుకు ఏ ఒక్క చాన్స్ కూడా ఇవ్వ‌కుండా, ఒత్తిడిని జయించి ఆడగలిగితేనే కంగారూల‌ను కొట్టేయ‌గ‌ల‌రు. మ‌న అమ్మాయిలు ఈసారైనా చరిత్ర సృష్టిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: