 
                                
                                
                                
                            
                        
                        1989లో శ్రీకాంత్ నుంచి కెప్టెన్సీ స్వీకరించిన అజహర్, దాదాపు పదేళ్లు భారత జట్టును నడిపించి అత్యంత విజయవంతమైన సారథిగా నిలిచాడు. అభిమానుల ముద్దుపేరు 'అజ్జూ భాయ్. సామన్య కుటుంబానికి చెందిన అజీదుద్దీన్, యూసుఫ్ సుల్తానా దంపతులకు 1963 ఫిబ్రవరి 8న జన్మించిన అజహర్, నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. 1981లో 18 ఏళ్ల వయసులో రంజీల్లో అరంగేట్రం చేసి, 1984 డిసెంబరు 31న ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు ద్వారా టీమ్ ఇండియాలోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌తో పాటు తర్వాతి రెండు టెస్టుల్లోనూ సెంచరీలు కొట్టి, అరంగేట్రంలోనే మూడు వరుస సెంచరీల చెరగని రికార్డును సృష్టించాడు. వరుసగా మూడు వన్డే ప్రపంచ కప్ లకు (1992, 1996, 1999) కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక భారత క్రికెటర్ ఈయనే. 99 టెస్టులు ఆడి 6,215 పరుగులు (22 సెంచరీలు), 334 వన్డేల్లో 9,378 పరుగులు (7 సెంచరీలు) చేశాడు.
టెస్టుల్లో అజహర్ అత్యధిక స్కోరు 199 కాగా, మణికట్టు మాయాజాలంతో బంతిని మంత్రదండంలా తిప్పుతూ షాట్లు కొట్టడం అతడి ట్రేడ్‌మార్క్ స్టైల్. ఇది తర్వాతి కాలంలో వీవీఎస్ లక్ష్మణ్ వంటి హైదరాబాదీ ఆటగాళ్లకు అలవాటైంది. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో 100వ టెస్టు ఆడే అవకాశం కోల్పోయాడు. జీవితకాల నిషేధానికి గురైనప్పటికీ, న్యాయపోరాటం చేసి 2012లో కోర్టు తీర్పుతో నిర్దోషిగా బయటపడ్డాడు. అంతకుముందే రాజకీయాల్లోకి వచ్చి 2009లో యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచాడు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుడైన అజహర్, గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నామినేట్ అయి తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి కాబోతున్నారు. మైదానంలో కష్టమైన క్యాచ్‌లను కూడా పట్టే అజహర్, ఇప్పుడు రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి