భారత్ క్రికెట్‌లో ఇప్పుడు మళ్లీ హీట్ పెరిగింది! గత రెండేళ్లుగా బీసీసీఐ ఇచ్చిన కఠిన సూచన ఒక్కటే — టీమ్ ఇండియాలో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ తప్పనిసరి! సీనియర్లు అయినా, జూనియర్లు అయినా ఎవరికీ మినహాయింపు లేదు. ఈ సారి ఆ జాబితాలో ఉన్నవారు మరెవరో కాదు — రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ! ఇద్దరూ ప్రస్తుతం టీమ్ ఇండియాలో వన్డే ఫార్మాట్‌కే పరిమితం అవుతున్నారు. అయితే మ్యాచ్ ఫిట్‌నెస్ లోపిస్తుందన్న కారణంతో బీసీసీఐ వీరికి స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది - “దేశవాళీ టోర్నీలు ఆడకపోతే జట్టులో స్థానం కష్టమే!” అని. ఈ నేపథ్యంలో వచ్చే నెల 24 నుంచి ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో ఈ దిగ్గజ బ్యాటర్లు పాల్గొనాల్సిందే.


రోహిత్ అయితే ఇంకో అడుగు ముందుకేసి, కేవలం వన్డే ఫార్మాట్‌లోనే కాకుండా ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కూడా ఆడతానని స్పష్టం చేశాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు ఈ విషయాన్ని ఇప్పటికే తెలియజేశాడు. అయితే నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ఉండటంతో రోహిత్ కేవలం ఒకటి, రెండు మ్యాచ్‌లకే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కోహ్లీ విషయానికి వస్తే - ఆయన కూడా దేశవాళీల్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని సమాచారం. కానీ విజ‌య్ హజారే ట్రోఫీలో ఖచ్చితంగా పాల్గొంటాడా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. చివరిసారిగా కోహ్లీ ఈ టోర్నీలో 2010లో ఆడాడు. ఆ సమయంలో ఇంకా టీమ్ ఇండియాలో ఆయన స్థానం ఖాయం కాలేదు.



 ఈ ఏడాది రంజీ ట్రోఫీలో ఆడినప్పటికీ పెద్దగా రాణించలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ ఫామ్ కోసం దేశవాళీల్లో బరిలోకి దిగుతాడా అనేది ఆసక్తిగా మారింది. విజయ్ హజారే ఎవరు? .. భారత్ తొలి తరం క్రికెట్ దిగ్గజుల్లో ఒకరైన విజయ్ హజారే, 1946 నుంచి 1953 వరకు టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 30 టెస్టుల్లో 2,192 పరుగులు చేసి, 47.65 సగటుతో మెరిశాడు. ఆయన గౌరవార్థమే ఈ టోర్నీని 2002-03 సీజన్‌లో ప్రారంభించారు. ఇప్పుడు ఈ టోర్నీలో రోహిత్, కోహ్లీ వంటి లెజెండ్స్ ఆడబోతుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మామూలుగా లేదు. వయసు, ఫామ్, ఫిట్‌నెస్ అన్నీ పరీక్షలో ఉన్నప్పుడు ఈ సీనియర్లు రాణిస్తే — వ‌చ్చే ప్రపంచకప్‌ రేసులో వీరి పేరు మళ్లీ టాప్‌లో ఉండడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: