వాషింగ్టన్: అంతరిక్షంలోకి వెళ్లాలంటే పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి.. భారీ శిక్షణలు తీసుకోవాలి.. అప్పుడుగానీ అంతరిక్షంకి అడుగుపెట్టలేము. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారుతోంది. కాలానికి తగినట్లు మనిషి మారుతున్నాడు. మన టెక్నాలజీ మారుతోంది. అందులో భాగంగానే సామాన్య మానవుడు కూడా అంతరిక్షంలోకి అడుగుపెట్టగలిగే కాలం వచ్చింది. దీనిని నిజం చేసేందుకు సిద్ధమైంది ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ. స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ప్రపంచంలోనే తొలి ప్రయివైటు అంతరిక్షయానానికి శ్రీకారం చుడుతోంది. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసేసింది.

స్పేస్ ఎక్స్ అంతరిక్ష ప్రయాణం ఈ ఏడాది చివరి మూడు నెలల్లో ఉంటుంది. దీనికోసం ఇప్పటికే స్పేస్ ఎక్స్ ఓ ప్రత్యేకమైన రాకెట్‌ను సిద్ధం చేసింది. అందులో కూడా డ్రాగన్ క్రూ క్యాప్సుల్‌ను వినియోగించి ప్యాసింజర్లను అంతరిక్షంలోకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్యాప్సూల్‌ ద్వారా నలుగురు వ్యక్తుల్ని కక్ష్యలోకి పంపవచ్చు. ఇందులో ఒకరు లీడ్ చేస్తుండగా.. మిగతా నలుగురు సాధారణ ప్యాసెంజర్లు అయి ఉంటారు. అయితే ఈ స్పేస్ ట్రిప్‌లో తొలి సారిగా ప్రయాణించగల అదృష్టాన్ని
‘షిఫ్ట్4 పేమేంట్స్’ సంస్థ సీఈఓ, పైలట్ జేర్డ్ ఐసాక్‌మన్ కొట్టేశాడు. అంతేకాదు.. ఆయన ఒక్కడే ఏకంగా ఇందులోని నాలుగు సీట్లనూ బుక్ చేసేసుకున్నాడు. అంతే అతడితో పాటు మిగతా ముగ్గురు ఎవరు ఉండాలో అతడు నిర్ణయిస్తాడన్నమాట.

ఇదిలా ఉంటే ఈ స్పేస్ జర్నీ కోసం వ్యోమగాములకు అవసరైన శిక్షణను ఇన్‌స్పిరేషన్-4 సిబ్బంది ఇవ్వనున్నట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. వీనికి శిక్షణనిచ్చేందుకు కూడా డ్రాగన్ వ్యోమనౌకతో పాటు ఫాల్కన్ 9 వ్యోమనౌకను వినియోగించనున్నట్లు తెలిపింది. ఆర్బిటాల్ మెకానిక్స్, జీరో గ్రావిటీని తట్టుకోవడంతో పాటు ఇతర అంశాలపై వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఇన్‌స్పిరేషన్-4 తెలిపింది. అంతా సక్రమంగా జరిగితే స్పేస్ ఎక్స్ రాకెట్ అంతరిక్షంలోకి అడుగు పెడితే.. అక్కడి నుంచి డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా ప్యాసెంజర్లు కొన్ని రోజుల పాటు అంతరిక్షంలో ఉంటారు.

అక్కడి నుంచి అంతరిక్షపు అందాలను ఆస్వాదిస్తారు. ఈ సమయంలో వారి క్యాప్సుల్ ముందుగానే నిర్దేశించిన కక్ష్యలో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి 90 నిముషాలకు ఒకసారి క్యాప్సుల్ భూమిని ఓ రౌండ్ వేసేస్తుంది. ట్రిప్ ముగిసిన తరువాత ఫ్లోరిడాలోని తీర ప్రాంతంలో ఇది సేఫ్‌గా ల్యాండ్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: