గాయపడిన వారిని స్థానిక అధికారులు వెంటనే అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇదిలా ఉంటే, ఆలయ సిబ్బంది మాత్రం అప్రమత్తంగా స్పందించి, మిగిలిన భక్తులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఘటనపై స్పందించిన గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే, “పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతుంది” అని తెలిపారు. హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం భక్తుల నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఆలయం గంగానదికి సమీపంలో ఉన్న కొండపై ఉండటంతో అక్కడికి చేరేందుకు మెట్ల మార్గం, రోప్ వే అనే రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది భక్తులు రోప్ వే ద్వారా వెళ్లినా, పుణ్యకాలాల్లో నడక మార్గం ఎక్కువగా భక్తులతో కిటకిటలాడుతుంది.
ఈ ఆలయంలో నాగ దేవతను కల్పవల్లిగా పూజిస్తారు. భక్తులు కోరిక తీరాలన్న ఆశతో చేతికి తోరణం కట్టి అమ్మవారి దర్శనానికి వెళతారు. కోరిక తీరిన తర్వాత మళ్లీ వచ్చి అదే మార్గంలో తోరణం తీసేసే సంప్రదాయం ఉంది. అలాంటి పవిత్ర క్షేత్రంలో ఇటువంటి దుర్ఘటన జరగడం అందరినీ కలచివేస్తోంది. ఈ విషాద ఘటనపై ప్రభుత్వం స్పందిస్తూ బాధితులకు అండగా నిలవాలని, భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆలయాల్లో భక్తుల రద్దీని అదుపులో ఉంచేందుకు చక్కటి ఏర్పాట్లు తప్పనిసరి అని మరోసారి ఈ ఘటన రుజువు చేసింది.