
జాతీయ మీడియా కథనాల ప్రకారం, జపాన్‌కు చెందిన ఒక మహిళ మరో వ్యక్తితో కలిసి స్కూటీపై వెళ్తూ ఉండగా, గురుగ్రామ్‌లోని ట్రాఫిక్ పోలీసులు వారిని ఆపారు. దానికి కారణం..స్కూటీ వెనక సీటులో కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకపోవడం. పోలీసులు వారిపై జరిమానా విధించాల్సి ఉంటుందని తెలిపారు. జరిమానా కట్టడానికి ఆ జపాన్ పర్యాటకులు కూడా ఒప్పుకున్నారు. అయితే జరిమానా మొత్తాన్ని నగదుగా చెల్లించాలని పోలీసులు డిమాండ్ చేశారు. "కోర్టులో చెల్లించాలా లేదా ఇక్కడ చెల్లించాలా?" అని వారు అడగగా, పర్యాటకులు వీసా కార్డు ద్వారా చెల్లించవచ్చా అని ప్రశ్నించారు. దీనికి "కార్డు వద్దు, నగదే ఇవ్వాలి" అని పోలీసులు స్పష్టంగా చెప్పారు.
దాంతో ఆ జపాన్ పర్యాటకులు 500 రూపాయల రెండు నోట్లను పోలీసులకు ఇచ్చారు. ఈ ఘటనను అక్కడే ఎవరో వీడియో తీయగా, అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. చట్టప్రకారం, ట్రాఫిక్ పోలీసులు జరిమానా తీసుకున్నప్పుడు, ఆ మొత్తం రసీదు తప్పనిసరిగా ఇవ్వాలి. జరిమానా చెల్లించడానికి పరివాహన్ యాప్ లేదా అధికారిక పోర్టల్ ద్వారా డిజిటల్ పద్ధతిలో చెల్లింపు జరగాలి. అవసరమైతే పోలీసులు పాయింట్ ఆఫ్ సేల్ మిషిన్ లేదా యూపీఐ పద్ధతిని ఉపయోగించి డిజిటల్ లావాదేవీ పూర్తి చేయాలి. చెల్లింపుల తర్వాత రసీదు తప్పనిసరిగా ఇవ్వాలి.
అయితే ఈ ఘటనలో పోలీసులు ఎలాంటి రసీదు ఇవ్వలేదు. దీనితో ఈ చెల్లింపు జరిమానా కాదని, అది లంచమని స్పష్టమైంది. సోషల్ మీడియాలో ఈ వీడియోపై విపరీతమైన చర్చ మొదలైంది. "పోలీసులు ఇలా బహిరంగంగా లంచం తీసుకుంటారా? దేశ పరువును ఇలా రోడ్డు మీద అమ్మేస్తారా?" అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "మీకు ప్రభుత్వం ఇచ్చిన జీతం సరిపోవడంలేదా? అందుకేనా కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకున్నది?" అంటూ పోలీసుల వైఖరిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
జపాన్ పర్యాటకులు కూడా ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళు మాట్లాడుతూ, "నాతో పాటు చాలా మంది వాహనదారులు హెల్మెట్ పెట్టుకోలేదు. కానీ వారిని పోలీసులు ఆపలేదు. నన్ను మాత్రమే ఆపారు. నేను ఇండొయన్ కాదని తెలిసి కావాలనే టార్గెట్ చేశారు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో పాటు వీడియో కూడా వైరల్ కావడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, ఆ పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చట్టరక్షకులే లంచం తీసుకుంటే ప్రజలకు ఎలాంటి రక్షణ లభిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!