దాదాపు 41 సంవత్సరాల తరువాత చెన్నై- శ్రీలంకలోని జాఫ్నా నగరాల మధ్య విమానసేవలు పునరుద్ధరించబడ్డాయి. శ్రీలంకలో ఈలం యుద్ధం ప్రారంభం కావడానికి ముందు వరకు అంటే 1970ల వరకు భారత్‌ నుంచి జాఫ్నాకు విమాన సర్వీసులు నడిచేవి. యుద్ధం ప్రారంభమైన తరువాత అత్యవసర పరిస్థితుల్లో మిలటరీ ఆపరేషన్లకు మాత్రమే విమానాలు నడుపుతున్నారు. యుద్ధం ముగిసి పరిస్థితుల్లో మార్పు వచ్చిన తరువాత 2002లో జాఫ్నా విమానాశ్రయం నుంచి డొమెస్టిక్‌ సర్వీసులను నడుపడం మొదలుపెట్టారు. 


తాజాగా ఇప్పుడు ఎయిర్‌ ఇండియా అనుబంధ అలియన్స్‌ ఎయిర్‌ వారంలో మూడు రోజులపాటు చెన్నై విమానాశ్రయం నుంచి జాఫ్నాకు విమాన సర్వీసులు నడుపనుందని తెలియజేశారు. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 90 నిమిషాలు. సోమవారం, బుధవారం, శనివారం ఈ సర్వీసులు నడుస్తాయి. ఈ క్రమంలో చెన్నై - జాఫ్నాల మధ్య విమాన సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. 
 
 గత అక్టోబర్‌ 17న నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో ప్రయాణికుల విమానాలు నడిపేందుకు మార్గం సుగమమైంది. ఎయిర్‌ ఇండియా సంస్థ అధికారికంగా సోమవారం చెన్నై నుంచి జాఫ్నాకు తొలి విమాన సర్వీసును నడిపింది. మధ్యాహ్నం 12.20 గంటలకు బయల్దేరిన ఈ విమానంలో 15 మంది ప్రయాణించారు. పైలట్‌ రత్నసింగ్‌ విమానాన్ని నడిపారు. ప్రయాణికుల సంఖ్యను బట్టి జాఫ్నాకు మరిన్ని విమానాలు నడుపుతామని ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్వాహకులు తెలిపారు. 


ఇదిలా ఉండగా, సోమవారం జాఫ్నా నుంచి కూడా చెన్నైకి విమాన సర్వీసులను అధికారికంగా నడిపారు. తొలి సర్వీసులో ఆ దేశ నార్తర్న్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ డా. సురేన్‌ రాఘవన్‌ ప్రయాణించారు. ఆయనకు చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఇక జాఫ్నా, చెన్నై నగరాల మధ్య విమాన సేవలు పునరుద్ధరించడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: