విశాఖలోని వెంకటాపురం ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. మృతి చెందిన వారిలో ఇద్దరు వృద్దులు, ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పరిశ్రమ నుంచి లీకైన గ్యాస్ పీల్చడంతో స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. 
 
కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మంపై దద్దుర్లు లాంటి సమస్యలతో రోడ్లపైకి పరుగులు తీశారు. మరికొందరు అపస్మారక స్థితిలోకి చేరుకుని రోడ్డుపైనే పడిపోయారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ ఘటన గురించి స్పందించారు. ప్రమాదానికి కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలుస్తోంది. ఈ ఘటన గురించి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించినట్టు సమాచారం. 
 
ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. జగన్ ఈరోజు మధ్యాహ్నం విశాఖకు చేరుకుని బాధితులను పరామర్శించనున్నారు. చంద్రబాబు వెంకటాపురం దుర్ఘటన బాధాకరం అని బాధితులకు వేగవంతంగా వైద్య సహాయం అందించాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: