ద‌క్షిణాఫ్రికాలో తొలిసారిగా బ‌య‌ట‌ప‌డిన ఒమిక్రాన్ ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌న్నింటినీ వ‌ణికిస్తున్న‌ది. కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింద‌నుకున్న స‌మ‌యంలోనే దాని కొత్త వేరియంట్ పుట్టుకురావ‌డంతో జ‌నం మ‌రింత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. తాజాగా బ్రిట‌న్‌లో తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం న‌మోదైన‌ది. ముఖ్యంగా యూకేలో రోజు రోజుకు ఒమిక్రాన్ విజృంభ‌న ఎక్కువవుతుంద‌ని.. ఇవాళ ఒక‌రు మృతి చెందిన‌ట్టు బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌  ప్ర‌క‌టించారు.

ఒమిక్రాన్ ను ఎదుర్కోవాలంటే బూస్ట‌ర్ డోస్ త‌ప్ప‌నిస‌రి అని.. రెండు డోసుల వ్యాక్సినేష‌న్ స‌రిపోద‌న్నారు బోరిస్ జాన్స‌న్‌.  ఒమిక్రాన్ క‌ట్ట‌డికి  స‌రైన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే వ‌చ్చే నాటికి 25 వేల నుంచి 75వేల మ‌ర‌ణాలు సంభ‌వించే అవ‌కాశం ఉన్న‌ద‌ని  నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. యూకేతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతూ ఉన్నాయి. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ పూన‌మ్ ఖేత్ర‌పాల్ ఒమిక్రాన్ వ‌ల్ల రీ ఇన్‌ఫెక్ష‌న్లు న‌మోదు అవుతున్నాయ‌ని.. డెల్టాతో పోల్చితే వ్యాధి తీవ్ర‌త త‌క్కువ‌గా ఉన్న‌ట్టు చెప్పారు. కానీ దీనిపై ఇప్పుడే ఓ నిర్ణ‌యానికి రాలేము అని స్ప‌ష్టం చేసారు పూన‌మ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: