ముఖ్యమంత్రి జగన్‌ చిత్రపటాలకు రాఖీలను కట్టి మరీ.. అన్నా.. మమ్మల్ని ఏడిపించకు ప్లీజ్‌ అని ఆ మహిళలు వేడుకుంటున్నారు. వారే.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు చెందిన జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు. కనీస వేతనం కోసం వారు నిన్న రాష్ట్రవ్యాప్తంగా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా జగనన్నకు అక్కా, చెల్లెమ్మలు విజ్ఞప్తి చేసుకుంటున్నామని.. కొవిడ్‌ కష్టకాలంలో కష్టపడిన తమ కళ్లలో కన్నీరు మంచిది కాదని వారు జగన్‌కు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. అడగకుండానే అందరికీ అన్ని ఇస్తున్న జగనన్న.. మాకు కూడా కనీస వేతనం వచ్చేలా చేయాలంటూయ... అనేక చోట్ల బ్యానర్లతో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ మహిళా ఉద్యోగులు ప్రదర్శనలు నిర్వహించారు.


ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెర వేర్చాలని.. 11వ పీఆర్సీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమకు 35 రోజుల సాధారణ సెలవులు అమలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నెల 22న సామూహికంగా సెలవు పెట్టి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన చేపడతామన్నారు. డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఈ నెల 29వ ఏ క్షణంలోనైనా సమ్మె చేస్తామని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: