మహాకవి గురజాడ అప్పారావు అవార్డును ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడం వివాదానికి దారి తీసింది. దీన్ని నిరసిస్తూ విజయవాడ బాలోత్సవ్ భవన్ వద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కవులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికవేత్తగా ఉన్న చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ అప్పారావు పురస్కారాన్ని ఇవ్వడం సరికాదని జాషువా సాంస్కృతిక వేదిక నాయకులు అన్నారు. గురజాడ అప్పారావు జీవితాంతం హేతువాదిగా, అభ్యుదయవాదిగా ఉన్నారని, అలాంటప్పుడు దేవుడి గురించి ప్రవచనాలు బోధించే చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ఎలా ఇస్తారంటూ నాయకులు నిలదీశారు.

గురజాడ అప్పారావు విశిష్ట పురస్కారాన్ని చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడంలో అసలు అర్థం లేదని నాయకులు  అన్నారు. సతీసహగమనం తప్పని అలాంటి దురాచారాన్ని తూలనాడిన మహాకవికి, ప్రవచన కర్త చాగంటి కి పొంతన ఎక్కడుందని నాయకులు ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని కమిటీ వెంటనే వెనక్కి తీసుకోవాలని నాయకులు  డిమాండ్ చేశారు. చాగంటి కి పురస్కారాన్ని ఇవ్వడాన్ని నిరసిస్తూ నవంబర్‌ 30 న గురజాడ వర్ధంతి రోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు జాషువా సాంస్కృతిక వేదిక  నాయకులు  ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: