ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ కు కాస్త ఊరట లభించింది. ఉద్యోగ సంఘాలన్నీ సమ్మె, పీఆర్సీ అంటూ కొన్నాళ్లుగా ఆయన్ను సతాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తీరిపోయినా.. విద్యుత్ ఉద్యోగులు మాత్రం జగన్ సర్కారుపై గుస్సాగా ఉన్నారు.. తమకు జీతాలు రాలేదని.. త్వరగా జీతాలు ఇవ్వకపోతే సమ్మెకు వెళ్తామని కొన్నిరోజులుగా హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఆ సమస్య తాత్కాలికంగా పరిష్కారం కావడంతో జగన్‌కు కాస్త రిలాక్స్ అని చెప్పుకోవచ్చు.


ఏపీ ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలు సానుకూలంగా ఉన్నందున తమ కార్యాచరణ వాయిదా వేస్తున్నట్టు ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది.  త్వరలో ప్రభుత్వం తో ఒప్పందం జరుగుతుందని ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ స్పష్టం చేసింది. అందువల్ల ప్రస్తుతానికి విద్యుత్ ఉద్యోగుల జెఎసి కార్యచరణ తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వెల్లడించింది.


వాస్తవానికి ఇవాళ్టి నుంచి రిలే నిరాహారదీక్షలు జరగాల్సి ఉన్నాయి. ప్రభుత్వం కాస్త దిగిరావడంతో ఈ దీక్షలను ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వాయిదా వేసుకుంది. దీంతో జగన్ సర్కారు కాస్త ఊపిరి పీల్చుకుంది.  నిన్న మొన్నటి వరకూ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఉద్యమం హడావిడి సాగిన సంగతి తెలిసిందే. 2,3 నెలల పాటు పీఆర్సీ అంశం వార్తల్లో హైలెట్ అయ్యింది. అయితే.. ఏదో రకంగా ఉద్యోగులను సంతృప్తి పరిచి వారి సమ్మె యోచనను విరమింపజేసింది.


ఆ తర్వాత ఇప్పుడు విద్యుత్‌ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ప్రస్తుతానికి వారు కూడా ఆందోళనలు విరమించేందుకు అంగీకరించారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆందోళనలు విరమిస్తామని చెప్పినా.. మరో విభాగం ఉద్యోగులు ఇంకా జగన్‌పై కోపంగానే ఉన్నారు.. వారే ఆర్టీసీ ఉద్యోగులు.. కొన్నాళ్ల క్రితం ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ ఉద్యోగులు.. గతంలో ఆర్టీసీగా ఉన్నప్పుడే తమకు అనేక సౌకర్యాలు ఉండేవని అంటున్నారు. ప్రభుత్వంలో విలీనమైన తర్వాత వాటిని తీసేశారని.. అంతకు ముందే బావుందని వారు అసంతృప్తిగా ఉన్నారు. వారు కూడా ఆందోళన కార్యాచరణ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: