చంద్రబాబు ఇటీవల ఖమ్మం సభలో పాల్గొన్నారు. తెలంగాణలోనూ పార్టీ పటిష్టతపై ఆలోచిస్తున్నారు. ఏపీ స్థాయిలో కాకపోయినా.. తెలంగాణలోనూ పార్టీని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో కొన్ని చోట్ల పోటీ చేసే ఆలోచనలో ఉన్నానని స్వయంగా చెప్పారు. అయితే.. సీఎం జగన్ ఇదే విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. తనకు ఇతర రాష్ట్రాలపై ఇంట్రస్ట్ లేదని.. ఏపీనే తన కార్యక్షేత్రమని బలంగా ప్రకటిస్తున్నారు.


చంద్రబాబు మాదిరిగా తాను ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని అనడం లేదని.. ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అని తాను అనడం లేదని జగన్ అంటున్నారు. అలాగే చంద్రబాబుతో కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని కూడా తాను అనడం లేదంటూ జగన్ సెటైర్ వేస్తున్నారు. ఏపీయే నా రాష్ట్రం, ఏపీలోనే నా నివాసం, ఏపీ పైనే తన మమకారం అంటూ బలంగా చెబుతున్నారు. ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలే తన కుటుంబమని.. ఇక్కడే నా రాజకీయం..ఇక్కడి ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం అని గట్టిగా నినదించి చెబుతున్నారు.


తనకూ చంద్రబాబు, పవన్‌లకు ఇదే తేడా అని జగన్ గుర్తు చేస్తున్నారు. నాయకుడు అనే వాడు ఎలా ఉండాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేవాడినిన్న జగన్.. నాయకుడికి విశ్వసనీయత ఉండాలన్నారు. నాయకుడు ఒక మాట చెబితే ఆ మాట మీద నిలబడుతాడన్న నమ్మకం ప్రతి మనిషికి ఉండాలని జగన్ అంటున్నారు. ఇప్పుడు మూడున్నరేళ్ల పరిపాలన తరువాత మీ బిడ్డ జగన్ గా ఇవాళ గర్వంగా చెప్పగలుగుతున్నానని.. మేనిఫెస్టోలో చెప్పినవి 98 శాతం హామీలు నెరవేర్చానని జగన్ చెప్పారు.


గతంలో చంద్రబాబు తన మ్యానిఫెస్టో ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తరువాత ఆ బుక్‌ను చెత్తబుట్టలో వేశారని జగన్ అంటున్నారు.  అలాంటి నాయకులకు, మాటమీద నిలబడే తనకు బిడ్డకు మధ్య యుద్ధం జరుగుతోందని జగన్ చెబుతున్నారు. మరో 16 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయన్న జగన్.. తాను ప్రజలనే నమ్ముకున్నానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: