జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బాగానే ఆడుకుంటున్నారు. ఇటు ఏపిలోను పొత్తు ధర్మాన్ని పాటించకుండా అవమానిస్తున్నారు. అలాగే తెలంగాణాలో కూడా పవన్ను ఏమాత్రం లెక్కచేయటం లేదు. పైగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కొర్పొరేషన్(జీహెచ్ఎంసి) ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారానికి రావాలని పవన్ను కోరటమంటే అవమానం చేసినట్లే భావించాలి. ఎందుకంటే గ్రేటర్ ఎన్నికల్లో జనసేనను పోటీనుండి విత్ డ్రా అయ్యేట్లు చేయటంలో కమలనాదులు సక్సెస్ అయ్యారు. నిజానికి రెండు పార్టీల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఎంత అయోమయం నెలకొందో పార్టీల నేతల మాటలను బట్టే అందరికీ అర్ధమైపోతోంది. ఎలాగంటే జీహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించేశారు. తన పార్టీ తరపున ఎన్నికల్లో అభ్యర్ధులను దింపబోతున్నట్లు పవన్ బీజేపీ నేతలకు మాట మాత్రంగా కూడా చెప్పలేదు. ముందు ప్రకటన చేసేసి తర్వాత బీజేపీతో పొత్తు గురించి ట్విట్టర్ వేదికగా ప్రతిపాదన చేశారు. ఇదే సమయంలో జనసేనతో బీజేపీకి పొత్తు ఉండదని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతోనే ప్రకటించేశారు. అంటే బండి చేసిన ప్రకటన వల్ల పవన్ పరువు సాంతం పోయినట్లే అనుకోవాలి.
ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే బీజేపీతో పొత్తుకు పవన్ పాకులాడుతుంటే బండి మాత్రం వద్దు వద్దంటూ దూరంగా పెట్టేసినట్లే జనాలకు అర్ధమైపోయింది. పొత్తు విషయంలో బీజేపీ ప్రకటన కారణంగా జనసేన తన అభ్యర్ధులను ప్రకటించేసింది. ఇదే పద్దతిలో బీజేపీ కూడా విడిగా తన జాబితాను విడుదల చేసేసింది. అంటే జీహెచ్ఎంసి పరిధిలోని 150 డివిజన్లకు రెండు పార్టీల తరపున అభ్యర్ధులు పోటీలో ఉంటారన్న విషయం క్లారిటి వచ్చేసింది. అయితే తెర వెనుక ఏమైందో ఏమో శుక్రవారం మధ్యాహ్నం గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు లక్ష్మాణ్ జనసేన అధినేత పవన్ను కోరారు. అందుకు పవన్ కూడా అంగీకరించటం విశేషం. గ్రేటర్ ఎన్నికలనే కాకుండా భవిష్యత్తులో తెలంగాణాలోని అన్నీ అంశాల్లోను రెండు పార్టీల మధ్య బంధం కొనసాగుతుందని లక్ష్మణ్ వివరించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకవైపు తన పార్టీ అభ్యర్ధులకు ప్రచారం చేస్తునే మరోవైపు బీజేపీ అభ్యర్ధులకు పవన్ ఎలా ప్రచారం చేస్తారో అర్ధం కావటం లేదు. పైగా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనందుకు ఏమీ అనుకోవద్దంటు పవన్ ఓ ఓదార్పు మాటన్నారు. అంటే అభ్యర్ధులను విత్ డ్రా చేస్తున్నట్లుగా పవన్ ప్రకటించారు. ఓట్లలో చీలిక రాకూదనే తాను బీజేపీకి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పిన పవన్ మరి పోటీకి రెడీ అయిన తమ అభ్యర్ధుల విషయాన్ని మాత్రం మాట్లాడలేదు. పోనీ ఇదంతా వదిలేసినా పవన్ ఇంటికి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వచ్చారే కానీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు రాలేదు ? ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించటం, తర్వాత విరమించుకోవటం పవన్ కు అలవాటుగా మారిపోయింది. ఇందుకనే పవన్ అంటే జనాల్లో నమ్మకం పోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి