- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ (2021) సినిమా ఓటీటీలో విడుదలైనప్పుడు హిందీ ప్రేక్షకులు సైతం విరగబడి చూశారు. ముఖ్యంగా, కాంతార లాంటి సినిమాల్లా డివైన్ ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్ చిత్రాలకు ఉత్తరాది జనం గత కొన్నేళ్లుగా బ్రహ్మరథం పడుతున్న సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకునే, ‘అఖండ 2’ సినిమాను టీమ్ ఏకంగా పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దడానికి బాగానే కష్టపడింది. ఈ సినిమా కోసం హిందీ ఆర్టిస్టులను కూడా చాలామందిని తీసుకున్నారు. అలాగే, హిందీ డబ్బింగ్ విషయంలో శ్రద్ధ వహించి, ముంబయికి వెళ్లి గట్టిగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.


అభిమానుల ఆశలు.. నిరాశ :
దీంతో, ‘అఖండ 2’ హిందీలో కూడా బాగా ఆడుతుందని, బాలకృష్ణకు తొలిసారిగా పాన్ ఇండియా ఫాలోయింగ్‌ను తెచ్చిపెడుతుందని అభిమానులు భారీగా ఆశించారు. కానీ, వారి ఆశలకు తగ్గట్టుగా ఏమీ జరగలేదు. అఖండ 2 - తాండ‌వం సినిమా కు తెలుగులోనే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. మిక్స్‌డ్‌ టాక్‌తో మొదలైనా, తొలి వీకెండ్ వరకు ఓపెనింగ్స్ బాగానే తెచ్చుకుంది. అయితే, సోమవారం నుంచి సినిమా వసూళ్లలో స్థిర‌త్వం క‌నిపిస్తోంది.


హిందీ వెర్షన్ దారుణం :
ఇక హిందీ వెర్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అక్కడ సినిమాకు సరైన రిలీజ్ దక్కలేదు. మొత్తం నార్త్ ఇండియా అంతటా కలిపినా, హిందీ షోలు వంద కూడా పడని పరిస్థితి ఏర్పడింది. ముంబయి, దిల్లీ వంటి ప్రధాన నగరాల్లో పట్టుమని పది షోలు కూడా 'అఖండ 2' హిందీ వెర్షన్‌కు ఇవ్వలేదు. వాటికి కూడా స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఈ సినిమాకు మరో పెద్ద మైనస్ ఏమంటే, అదే సమయంలో విడుదలైన ‘దురంధర్’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడం. ఆ సినిమా హవా ఉండగా, ‘అఖండ 2’ ను హిందీ ప్రేక్షకులు అసలు పట్టించుకోవట్లేదు. ప్రధాన నగరాల్లో వీకెండ్‌లో కూడా పెద్దగా ఆక్యుపెన్సీలు లేవు. ఇక వీక్ డేస్‌కు వచ్చేసరికి థియేటర్లు దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అందుబాటులో ఉన్న కొన్ని షోలకు కూడా జనం లేకపోవడం హిందీ జనాల్లో సినిమా పట్ల పెద్దగా ఆసక్తి లేదన్నది స్పష్టం చేస్తోంది. ఫైన‌ల్‌గా ‘అఖండ 2’ హిందీ వెర్షన్ ఏమాత్రం ప్రభావం చూపకుండానే థియేట్రికల్ రన్‌ను ముగించేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: