
కరోనా వైరస్ కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఆదేశాలు అమలవుతున్నాయా ? అన్న సందేహం పెరిగిపోతోంది. ఒకవైపేమో ఆరోగ్యశ్రీ ఎంపానల్ మెంట్ లోని ఆసుపత్రులు సగం బెడ్లను మామూలు జనాలకు ఉచితంగా ఇవ్వాలని జగన్ ఆదేశించారు. మరోవైపేమో ప్రైవేటు ఆసుపత్రుల్లోని చాలా యాజమాన్యాలు మామూలుజనాలను కనీసం తమ ఆసుపత్రుల గడపలను కూడా తొక్కనీయటంలేదు. ఇదే సమయంలో కరోనా వైరస్ కు వైద్యం పేరుతో లక్షలకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. వీటిపై యాక్షన్ తీసుకుంటామన్న జగన్ హెచ్చరికలను చాలా యాజమాన్యాలు ఏమాత్రం లెక్కచేయటంలేదు.
ఇక రోగులను చేర్చుకోవటంలో ఎలాంటి సమస్యా లేదని కోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. అయితే బెడ్లు దొరక్క వేలాదిమంది రోగులు నానా అవస్తలు పడుతున్నారు. ప్రత్యేకించి కరోనా వైరస్ సోకిన రోగుల సహాయార్ధం కోసమే 104 నెంబర్ కాల్ సెంటర్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అయితే అది సరిగా పనిచేయటం లేదనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మీడియా సమక్షంలో వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి ఫోన్ చేస్తేనే 104 సరిగా పనిచేయలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు, ఆరోగ్య శ్రీ ప్యానల్ ఆసుప్రతులన్నీ కలిపి 598 ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. వీటిల్లో 41,517 మంది చికిత్స పొందుతున్నారని, మరో 6922 బెడ్లు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మరి నేరుగా రోగులు ఆసుపత్రులకు వెళితే బెడ్లు లేవని, ఆక్సిజన్ లేదని యాజమాన్యాలు ఎందుకు బెబుతున్నట్లు ? పై రెండు ప్రకటనల్లో ఏది నిజం ?
ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గబ్బుపట్టిద్దామని చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఏదో రూపంలో ప్రతిరోజు బురదచల్లేస్తోంది. ప్రధాన ప్రతిపక్ష హోదాలో కరోనా వైరస్ రోగులకు టీడీపీ చేస్తున్నదేమీ లేకపోయినా ప్రభుత్వంపై మాత్రం పదే పదే ఆరోపణలు, విమర్శలు పెంచేస్తోంది. జనాల దృష్టిలో జగన్ను ఎంతవీలుంటే అంతా డీఫేం చేయటానికి బాగా ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని సమీక్షల సందర్భంగా తాను ఇస్తున్న ఆదేశాలు సక్రమంగా అమలయ్యేలా జగన్ అప్రమత్తంగా ఉండాలి. ఆదేశాలు అమలవుతున్నాయ లేదా అనే విషయంలో ఫాలోటప్ యాక్షన్ చాలా అవసరం. లేకపోతే పడుతున్న కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోతుంది.