
సింగరేణి సంస్థ సుమారు రూ.6,800 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణం కోసం నవంబర్ నెలలో దేశవ్యాప్త టెండర్లకు ఆహ్వానం పలికింది. జనవరి నుంచి నిర్మాణపు పనులు ప్రారంభించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ కొత్త ప్లాంట్ ను ప్రస్తుతం మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల 1200 మెగావాట్ల ప్లాంటు ఆవరణలోనే నెలకొల్పుతారు. ప్రస్తుత ప్లాంట్‌కు గల బొగ్గు రవాణా, నీటి వసతులను ఈ కొత్త ప్లాంట్ కు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. అందువల్ల కొత్త ప్లాంట్‌కు అదనంగా ఈ రెండింటి విషయంలో నిర్మాణ వ్యయం తగ్గుతుంది.
మూడో దశ సోలార్ ప్లాంట్ల నిర్మాణంపై సమీక్షించిన సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం వాటర్ రిజర్వాయర్ లో నిర్మాణంలో ఉన్న 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను వచ్చే మార్చి నాటికి ప్రారంభించాలని భావిస్తున్నారు. తొలి 5 మెగావాట్ల ఫ్లోటింగ్ ప్లాంట్‌ను ఈ నెలాఖరు కల్లా ప్రారంభించాలని సింగరేణి సంస్థ ఛైర్మన్ ఆదేశించారు. మూడో దశలోని మిగిలిన 66 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ను వచ్చే జూన్ కల్లా పూర్తి చేయాలని సింగరేణి సంస్థ ఛైర్మన్ స్పష్టం చేశారు.
ఈ జాబితాలో రామగుండం 3 ఏరియాలోని ఓపెన్ కాస్టు 1 ఓవర్ బర్డెన్ డంప్ పైన తొలిసారిగా నిర్మిస్తున్న 22 మెగావాట్ల సోలార్ ప్లాంట్ కూడా ఉంది. మిగిలిన వాటిలో చెన్నూరు ప్రాంతంలో 11 మెగావాట్లు, కొత్తగూడెంలో 33 మెగావాట్ల ప్లాంట్లు ఉన్నాయి. మొత్తానికి సింగరేణి తెలంగాణలో వెలుగులు నింపడంలో తన వంతు పాత్ర పోషిస్తోంది.