- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఇటీవల వైసీపీ నాయకులు, అలాగే ఆ పార్టీకి అనుబంధంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వ్యవహరిస్తున్న సానుభూతిపరులు ఒక మాటను బహిరంగంగా చెబుతున్నారు. “ జగన్‌కి ఇక జాకీలు వేయలేము ” అంటున్నార‌ట‌. ఇది కేవ‌లం ఒక కామెంట్ మాత్ర‌మే కాదు. పార్టీలో ప్ర‌స్తుత ప‌రిస్థితి ప్ర‌తిబింబించే నిజ‌మైన భావ‌న‌గా మారుతోంది. గత 16 నెలలుగా వైసీపీ తరఫున బలమైన వాయిస్‌గా ప్రజల్లోకి వెళ్లే నాయకులు లేకపోవడం, పార్టీ పట్ల ఉత్సాహం తగ్గిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. బొత్స సత్యనారాయణ వంటి అనుభవజ్ఞులైన నేతలకు అవకాశం ఉన్నా.. ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా వారు కూడా పూర్తి స్థాయిలో యాక్టివ్‌గా ఉండ‌ట్లేదు. గత ఎన్నికల్లో జగన్ స్వయంగా తీసుకున్న నిర్ణయాలతో చాలామంది సీనియర్ నాయకులకు టికెట్లు దక్కకపోవడం కూడా అసంతృప్తికి దారితీసింది. ఫలితంగా పార్టీ తరఫున బలంగా మాట్లాడే నాయకులు సైలెంట్‌ అయ్యారు.


ఈ పరిస్థితిలో సోషల్ మీడియా మాత్రమే వైసీపీ తరఫున కాస్తో కూస్తో యాక్టివ్‌గా ఉంటోంది. గతంలో సాక్షిలో లేదా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వైసీపీ సానుభూతిప‌రులు యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అదే సమయంలో కొందరు విమర్శకులు కూడా అవుతున్నారు. జగన్‌ను కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నా.. ఆయన ప్రజా ఇమేజ్ మాత్రం పెరగడం లేదని వీరే చెబుతున్నారు. జగన్ ఎక్కడైనా మాట్లాడితే మాటల్లో తప్పులు చేయడం, స్క్రిప్ట్‌ చదవడంలో కూడా ఇబ్బంది పడడం వంటి అంశాలు ఆయన నాయకత్వంపై ప్రతికూలత‌ను బాగా పెంచుతున్నాయి.


దీంతో పార్టీపై సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్‌ ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదు. తమ కృషి ఫలితమివ్వడం లేదని, ఎంత హైప్‌ చేసినా జగన్ గ్రాఫ్‌ పెరగడం లేదని వైసీపీ అనుకూల వర్గాలు తేల్చి చెబుతున్నాయి. మొత్తంగా, వైసీపీ తరఫున బలమైన వాయిస్‌ లేకపోవడం, నాయకత్వం ప్రజలతో అనుసంధానం కోల్పోవడం, అలాగే పార్టీ సానుభూతిపరులు నిరాశకు లోనవడం ఇవ‌న్నీ చూస్తే జ‌గ‌న్‌కు జాకీలు వేయ‌లేం అన్న వ్యాఖ్య వెన‌క వాస్త‌వం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ పరిస్థితిని పార్టీ సీరియస్‌గా విశ్లేషించి, మళ్లీ ప్రజల్లో నమ్మకం పొందే దిశగా చర్యలు తీసుకుంటుందా లేదా ? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: