టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం పార్టీ వ్యవహారాల్లో కీలక స్థానాన్ని సంపాదించుకున్నట్టే కనిపిస్తున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలు ఆయనకు దాదాపు పార్టీపై ఫుల్ పవర్స్ వచ్చేశాయన్న భావనను నేతలు, కార్యకర్తలు స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు పార్టీ వ్యవస్థ మొత్తం చంద్రబాబు సెంట్రిక్‌గా నడుస్తూ ఉండగా, ఇప్పుడు లోకేష్ కూడా ఆ సెంటర్‌లో కీలక స్థానాన్ని దక్కించుకున్నారు.ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సంఘటనలు ఈ మార్పుకు మూలం అయ్యాయి. ప్రాజలకు చేరువ కావడంలో విఫలమవుతున్న కొందరు నాయకులను ఉద్దేశించి లోకేష్ గట్టిగా హెచ్చరించారు. పార్టీ సిద్ధాంతాలను పక్కనబెట్టి స్వతంత్ర ధోరణిలో నడుచుకుంటున్న వారికి ఆయన ఇచ్చిన కఠిన సందేశం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.


“ మీకు అంత నమ్మకం ఉంటే స్వతంత్రంగా పోటీ చేసి గెలవండి. కానీ పార్టీలో ఉంటే క్రమశిక్షణతో, సిద్ధాంతాలకట్టుబడి పనిచేయాలి ” అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు బలమైన ఇంపాక్ట్ సృష్టించాయి.
ఈ హెచ్చరికలతోపాటు, లోకేష్ ప్రవర్తనలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం, నిర్ణయాత్మకత టీడీపీ నేతలలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు పార్టీలో “ఫైనల్ వార్డ్” లా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గడచిన కొన్ని సంవత్సరాలుగా యువనేతగా పార్టీ కార్యకర్తలతో సన్నిహితంగా ఉండి, నేరుగా ఫీల్డ్‌లో పనిచేయడం ఆయనకు బలమైన అస్త్రంగా మారింది.


ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా తన కుమారుడి వైఖరికి పూర్తి మద్దతు ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయ సందర్శన సందర్భంగా, కొందరు నేతలు లోకేష్ చేసిన హెచ్చరికల గురించి ప్రస్తావించగా, చంద్రబాబు స్పష్టంగా స్పందించారు. “ లోకేష్ చెప్పిన హెచ్చరికలు అందరికీ వర్తిస్తాయి. పార్టీ సరిగా ఉండాలి, సిద్ధాంతాల ప్రాతిపదికన అందరూ పనిచేయాలి ” అంటూ ఆయన తేల్చి చెప్పడంతో, లోకేష్‌కు బలమైన బ్యాకింగ్ ఇచ్చినట్టే అయ్యింది.


ఇక ఈ పరిణామాల తర్వాత, పార్టీలోని పెద్దలు, యువనేతలు అందరూ లోకేష్ మార్గదర్శకత్వంలో ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు. నాయకత్వంలో క్రమశిక్షణ, స్పష్టత, దిశా నిర్దేశం కనిపిస్తోందన్న అభిప్రాయం టీడీపీ అంతర్గతంగా గట్టిగా వినిపిస్తోంది. చంద్రబాబు ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, నారా లోకేష్‌కు “ డీ ఫాక్టో ఫుల్ కంట్రోల్ ” వచ్చేసిందనే భావన పార్టీ అంతటా స్థిరపడుతోంది. దీంతో టీడీపీ భవిష్యత్ దిశలో లోకేష్ పాత్ర మరింత ప్రభావవంతంగా మారనుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: