చిన్నపిల్లలకు  తొలి గురువులు తల్లిదండ్రులే. తల్లి తండ్రులను చూస్తూనే పెరుగుతారు. ఇంటి వాతావరణం మరియు ఇంట్లోని వ్యక్తుల వైఖరులే మీ పిల్లలను బాగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు వారి సున్నితమైన మనసులలో మంచి భావాలను నింపే పని చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్కలా ఉంటాడు. కొందరు ఎప్పుడూ కొంటెగా ఉంటారు. కొందరు పిల్లలు కొంచెం ఆట పట్టిస్తారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను, బామ్మలను చాలా బాధపెడతారు. ఇంట్లోని వస్తువులను నాశనం చేయడం, ఎక్కువగా అరుస్తూ ఉండటం, ప్రతిసారీ గుమ్మం దాటి బయటకు వెళ్లడం వంటివి చేసినప్పుడు మీరు కోపం తెచ్చుకోకండి.

 

అలాగే పిల్లలను కొడితే లేదా తిడితే వారికి జ్ఞానం వస్తుందనే భావనలో ఉంటే ముందు దాన్ని వదిలేయండి. పిల్లల్ని కొడితే వాళ్ళు ఇంకా మొండిగా తయారు అవుతారు తప్ప తల్లి తండ్రుల మాట అసలు లెక్కచెయ్యరు. ఇక ముఖ్యంగా నేటి తరం పిల్లలు గ్యాడ్జెట్ లకు పూర్తిగా బానిసలవుతున్నారు. అంతేకాదు పిల్లల్లో మొండితనం, గ్యాడ్జెట్ వ్యసనం వంటి చెడు అలవాట్లను ఎలా అధిగమించాలో చూడండి. నేటి తరం తల్లిదండ్రులు పిల్లలకు గ్యాడ్జెట్స్ ఇవ్వడం సాధారణమైంది. ఇక కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి వ్యసనాలను ప్రోత్సహిస్తున్నారు. ఇది ఇలాగే నిరంతరం జరిగితే పిల్లల సృజనాత్మకతను నాశనం చేస్తుంది. అందుకే మీరు పిల్లల వద్ద ఉన్నప్పుడు మీరు గ్యాడ్జెట్ వ్యసనాన్ని పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నించాలి. అందుకోసం ఇలా చేయండి.

 

పిల్లల ముందు మీ మొబైల్ వాడకాన్ని తగ్గించండి. మీరు మీ మొబైల్‌ను ఎక్కువగా ఉపయోగించకండి. మీ పిల్లలను బయటకు వెళ్లి ఆటలు ఆడటానికి ప్రోత్సహించండి. వారితో ఆడుకోండి. ఈ రకమైన ఆటలు పిల్లల మానసిక మరియు శారీరక అభివృద్ధికి మంచివి. చిన్న పిల్లలకు, గాడ్జెట్‌ను పరిమిత సమయం వరకే ఉపయోగించాలనే నిబంధనను తీసుకురండి. పిల్లలు పెరిగేకొద్దీ వారికి స్వేచ్ఛను ఇవ్వండి. కొంతమంది పెరిగేకొద్ది పెద్దల మాట వినరు. ఇంతమాత్రాన మీరు వారిపై కోపం తెచ్చుకోవద్దు. మీ పిల్లల అభిప్రాయానికి విలువ ఇస్తున్నట్లు వారికి తెలియజేయండి. మీ మాటలను వినేలాగా, మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచేందుకు మీ బిడ్డను ప్రోత్సహించండి.

 

కొందరు పిల్లలు ఏదైనా విషయంలో కలత చెందితే నేల మీద పడి దొర్లుతారు. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. అలాంటి పిల్లలతో వ్యవహరించడం అంత సులభం కాదు.  అలాంటి పిల్లలతో ఓపికగా వ్యవహరించాలి. వారి ప్రవర్తనను మెల్లగా మార్చాలి. మీ బిడ్డకు కోపం రావడానికి కారణమేంటో తెలుసుకోండి. పాఠశాలకు వెళ్ళే పిల్లలు కొన్నిసార్లు హోంవర్క్, ప్రాజెక్ట్ కోసం ఒత్తిడికి గురవుతారు. వారి మానసిక ఒత్తిడికి కారణమేమిటో తెలుసుకోండి. వీలైతే మీ పిల్లల తరగతి గది ఉపాధ్యాయుడితో మాట్లాడండి. పిల్లల కోపం రోజురోజుకు పెరుగుతున్నట్లయితే, కోపాన్ని నియంత్రించడానికి చైల్డ్ కౌన్సెలర్‌ దగ్గరికి తీసుకెళ్లడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: