చాల మంది పిల్లలు తొందరగా కోపానికి గురవుతారు. టీనేజ్‌లో పిల్లలు వివిధ రకాల భావోద్వేగాలకు లోనవుతారు. ఆనందం, ఒంటరితనం, చికాకు, కోపం.. వంటి మూడ్ స్వింగ్స్ వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అయితే అప్పటికే కోపంగా ఉన్న టీనేజర్లను తిట్టడం, కొట్టడం వల్ల వారు మరింత తీవ్రంగా స్పందిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు వారిపై ప్రతాపం చూపించకుండా, పిల్లల కోపాన్ని బయట పెట్టనివ్వండి. అవసరమైతే వారితో విడిగా మాట్లాడండి. లేదంటే కొంత సమయం తర్వాత ఏం జరిగిందని ప్రశాంతంగా అడగండి. ఇలా చేయడం వల్ల వారిని అర్థం చేసుకున్న భావన కల్పిస్తూ, పిల్లల కోపాన్ని తగ్గించవచ్చు.

ఇక చిన్నప్పటి నుంచి పిల్లలు అడిగినవన్నీ ఇస్తుంటే, ఆ ప్రభావం టీనేజ్‌లో వారిపై పడుతుందని నిపుణులు తెలిపారు. వారు కోరిన వాటికి అడ్డు చెబితే పెద్దయ్యాక కూడా కోపానికి గురవుతున్నారు. ఈ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే పిల్లలకు అడిగినవన్నీ ఇవ్వకూడదు. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్లు వారికి అన్ని విషయాలూ అర్థమయ్యేలా చెబితే ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా జాగ్రత్త పడవచ్చు.

అయితే టీనేజర్లు పెద్దవాళ్లపై కోపంతో, ఎక్కువగా మాట్లాడకుండా తమ పని తాము చేసుకుపోతుంటే ఏం జరిగిందో తెలుసుకోవాలి. వారితో మనసు విప్పి మాట్లాడాలి. కోపానికి కారణాలను అడగాలి. ఆపద సందర్భాల్లో వారికి అండగా ఉంటామనే భరోసా ఇవ్వాలి. కోపాన్ని అరికట్టడానికి ఉపాయాలు, మార్గాలను ఉపయోగించండి. వారితో కలిసి యోగా, ధ్యానం చేయడం, ఆటలు ఆడటం వంటివి చేయడం వల్ల సంబంధాలు బలోపేతమవుతాయి.

పిల్లలు మీతో ఏదైనా విషయంపై కోపంగా వాదిస్తున్నప్పుడు, దానికి ఎక్కడ, ఎలా ముగింపు పలకాలో తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల వారు శాంతిస్తారు. ఆ తరువాత మరోసారి అదే అంశం గురించి వివరణ అడగాలి. మరోసారి ఇలాంటివి ఎదురుకావని వారి నుంచి హామీ తీసుకోవాలి. పిల్లలను సరైన మార్గంలో పెట్టడానికి మామూలుగా తిట్టడం, కొట్టడం మంచిదే. కానీ ఎలాంటి సందర్భాల్లో వారిపై కోపం మంచిదో పెద్దవాళ్లు తెలుసుకోవాలి. అకారణంగా, పదేపదే యుక్త వయసుకు వచ్చిన వారిని తిడుతూ ఉంటే, వారు మీకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా తయారవుతారు. సరైన సమయంలో సరైన విధంగా పిల్లలతో ప్రవర్తించడం వల్ల వారి కోపాన్ని అదుపులో ఉంచవచ్చు. అన్ని విషయాలు అర్థమయ్యేలా వారికి వివరించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: