హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌ పరిసరాల పరిస్థితి గత రెండు దశాబ్దాల్లో పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఇది కుగ్రామంలా ఉండేది. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇక్కడికి రావడం కూడా భయపడే పరిస్థితి. కానీ హైటెక్‌సిటీ ఏర్పాటు తర్వాత మాదాపూర్‌, గచ్చిబౌలి, ఖాజాగూడ వంటి ప్రాంతాల రూపురేఖలు మొత్తం మారిపోయాయి. బహుళ జాతి ఐటీ కంపెనీల రాక, ఉద్యోగాల పెరుగుదల వల్ల ఇళ్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఈ డిమాండ్ కారణంగానే అద్దెలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఒకప్పుడు సింగిల్‌ బెడ్‌రూమ్‌ రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య లభించేది. ఇప్పుడు అదే ఇల్లు రూ.20 వేల నుంచి రూ.25 వేల మధ్య ఉంది. నాలుగేళ్ల క్రితం 2బీహెచ్‌కే ఫ్లాట్‌ అద్దె రూ.23 వేల వరకూ ఉండేది. ప్రస్తుతం అదే ఇల్లు రూ.35 వేల వరకూ పెరిగింది. ఖాజాగూడలోని గేటెడ్ కమ్యూనిటీల్లో మూడు బెడ్‌రూమ్‌ ఇళ్లకు రూ.50 వేల వరకు అద్దె వసూలు చేస్తున్నారు.


రియల్‌ ఎస్టేట్‌ నిపుణుల ప్రకారం, గత ఐదేళ్లలో హైటెక్‌సిటీ పరిసరాల్లో అద్దెలు సుమారు 50 శాతం పెరిగాయి. ఎక్కడ టూ లెట్ బోర్డు కనిపించినా నాలుగు అయిదు రోజుల్లోనే అది తీసేస్తున్నారు. ఇక్కడి మరో ప్రత్యేకత ఏమిటంటే బ్యాచిలర్లకు ఇల్లు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో బ్యాచిలర్లకు ఇల్లు ఇవ్వడం కష్టతరమవుతుంటే, హైటెక్‌సిటీ ప్రాంతంలో మాత్రం వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఐటీ ఉద్యోగులు ఇద్దరు, ముగ్గురు కలిసి ఒక ఫ్లాట్‌లో ఉంటారు. అద్దె మొత్తాన్ని భాగాలుగా చెల్లించుకుంటారు.


యజమానులు కూడా వారిని ఇష్టపడతారు. ఎందుకంటే వారు ఉదయం ఆఫీసులకు వెళ్లి రాత్రి ఆలస్యంగా వస్తారు.. దీంతో నీటి ఖ‌ర్చు కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. ఓవ‌రాల్‌గా హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలు ఇప్పుడు హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్ మార్కెట్‌కు కేంద్ర బిందువులుగా మారాయి. ఇక్కడి అభివృద్ధి, అద్దెల పెరుగుదల నగర ఆర్థిక వ్యవస్థలో ఐటీ రంగం ఎంత ప్రభావం చూపుతోందో స్పష్టంగా తెలియజేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: