అక్కినేని ఫ్యామిలీ అంటేనే రొమాంటిక్ ఫ్యామిలీగా చెప్పుకోవచ్చు.. ఆ ఇంటి ఇలవేలుపు అక్కినేని నాగేశ్వరరావు వందల కొద్దీ ప్రేమ కథలకు ప్రాణం పోసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ యాక్షన్ స్టోరీస్ తో అదరగొడుతున్న సమయంలోనే ప్రేమ రారాజుగా ఏఎన్నార్ తన సత్తా చాటుకున్నారు. తనకంటూ ఓ బ్రాండ్ సృష్టించుకున్నారు.

ఏఎన్నార్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నాగార్జున కూడా నవ మన్మథుడిగా నిరూపించుకున్నారు. ఈ వయసులోనూ ప్రేమ పాత్రలు అలవోకగా పోషిస్తున్నారు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ అమలను ప్రేమ పెళ్లి చేసుకుని.. నిజమైన ప్రేమ నాయకుడుగా నిలిచిపోయారు. 

ఇప్పుడు నాగ్ ఫ్యామిలీలో కుర్ర హీరోలు కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నాగ చైతన్య- సమంతల పెళ్లి ఖాయమనే వదంతలు పెద్ద ఎత్తున వినిపించాయి. సమంత కూడా వీటికి బలం చేకూర్చేలా ఇంటర్వ్యూలిచ్చారు. ఇంకా ఈ విషయంలో క్లారిటీ రాకపోయినా నాగ చైతన్య, సమంతల జంట బావుంటుందనే చర్చలు సాగుతున్నాయి.


ఇప్పుడు తాజాగా.. నాగ్ చిన్న కుమారుడు అఖిల్ ప్రేమలో పడ్డారట. యస్.. నేనో అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని అఖిల్ ..  ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం ఒప్పేసుకున్నాడు. ఈ కుర్రాడి మనసు దోచింది ఫ్యామిలీ ఫ్రెండేనట.  ఆ అమ్మాయి ఫ్యామిలీ, నాగ్ ఫ్యామిలీ మధ్య ఎప్పట్నుంచో చక్కటి స్నేహం కూడా ఉందట. 

అంతేకాదు అఖిల్ తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పారట. ఎప్పట్నుంచో తెలిసిన కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో అఖిల్ లవ్‌ని నాగ్, అమల ఓకే చేసినట్టు తెలుస్తోంది. సో.. మొత్తానికి నాగ చైతన్య, అఖిల్ కూడా నాగ్ బాటలోనే ప్రేమ పెళ్లిళ్లు చేసుకోబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: