అపజయం మెరుగని అగ్ర దర్శకులు


రాజమౌళి .. పరిచయం అవసరం లేని అగ్రదర్శకుడు. తెలుగు సినిమాను ప్రపంచపటంపై నిలిపిన ప్రతిభాశాలి. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ఆ కథలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించడం రాజమౌళి ప్రత్యేకత. రాజమౌళి ఒక్క పూటలో స్టార్ డైరెక్టరై పోలేదు .. ఒక్క రాత్రిలో ప్రపంచాన్ని మొత్తం తనవైపుకు తిప్పుకోలేదు. ఆ స్థాయికి ఆయన రావడం వెనుక ఎంతో కృషి .. మరెంతో పట్టుదల ఉన్నాయి. ఆయన ఒక ప్రణాళిక ప్రకారం వివిధ జోనర్లలో సినిమాలు చేస్తూ వెళ్లారు. ఒకసారి టచ్ చేసిన జోనర్ జోలికి మళ్లీ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు.

కాలేజ్ నేపథ్యంలో 'స్టూడెంట్ నెంబర్ 1' .. స్పోర్ట్స్ నేపథ్యంలో 'సై' .. ఫ్యాక్షన్ నేపథ్యంలో 'సింహాద్రి' .. సోషియో ఫాంటసీ నేపథ్యంలో 'యమదొంగ' .. పునర్జన్మ నేపథ్యంలో 'మగధీర' .. తల్లి - కొడుకు సెంటిమెంట్ ప్రధానంగా 'ఛత్రపతి' .. తండ్రి - కూతురు సెంటిమెంట్ తో 'విక్రమార్కుడు' .. గ్రాఫిక్స్ కి పెద్ద పీటవేస్తూ 'ఈగ' .. జానపద కథకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి 'బాహుబలి'.. 'బాహుబలి 2' సినిమాలను ఆయన తెరకెక్కించాడు. కథలోని కొత్తదనం .. కథనంలోని పట్టు .. పాత్రలను డిజైన్ చేసిన తీరులో రాజమౌళి ప్రతిభా పాటవాలు ఆయనను అగ్రస్థానంలో నిలబెట్టాయి


కొరటాల శివ విషయానికొస్తే దర్శకుడు కాకముందు రచయితగా ఆయన కొన్ని హిట్ చిత్రాలకు పనిచేశారు. అందువలన దర్శకుడిగా తన సినిమాలకి సంబంధించిన కథాకథనాల విషయంలో ఆయన చాలా కసరత్తు చేస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు తన కథలో ఉండేలా చూసుకుంటారు. వినోదంతో పాటు సందేశం కూడా అంతర్లీనంగా ఉండే కథలను ఆయన ఎంచుకుంటారు. అదే సమయంలో సందేశమనేది వినోదాన్ని డామినేట్ చేయకుండా జాగ్రత్తపడతారు.


హీరోలను కొత్తగా .. మరింత హ్యాండ్సమ్ గా చూపించడం సన్నివేశాలను .. సంభాషణలను సహజంగా రాసుకోవడం ఆయన స్పెషాలిటీ. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ ఆయన కథను నడిపించే తీరు భిన్నంగా ఉంటుంది. సహజంగానే ఆయన సినిమాల్లో పొలిటికల్ టచ్ ఎక్కువగా కనిపిస్తుంది. కామెడీ పాళ్లు తక్కువే .. అయినా ఆ విషయాన్ని ప్రేక్షకులు పట్టించుకోనంత పట్టుగా కథను నడిపించడం ఆయన ప్రత్యేకత. 'మిర్చి' .. 'శ్రీమంతుడు' .. 'జనతా గ్యారేజ్' .. 'భరత్ అనే నేను' సినిమాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి.

ఇక కొరటాల మాదిరిగానే అనిల్ రావిపూడి కూడా రైటింగ్ డిపార్ట్ మెంట్ నుంచి దర్శకత్వం వైపు వచ్చినవారే. ఈ కారణంగానే ఆయన తన సినిమాలకి తనే కథ . స్క్రీన్ ప్లే .. మాటలు రాసుకుంటారు. అనిల్ రావిపూడి సినిమాలో రాజమౌళి సినిమాల్లో మాదిరిగా గ్రాఫిక్స్ ఉండవు .. కొరటాల సినిమాల్లోలా సందేశం ఉండదు. ఆయనకి తెలిసినదెల్లా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. యాక్షన్ .. ఎమోషన్ తో పాటు కామెడీకి ఎక్కువగా ఆయన ప్రాధాన్యతనిస్తాడు. శ్రీను వైట్ల తరువాత అంత టైట్ గా కామెడీ ఎపిసోడ్స్ ను ఆవిష్కరించే దర్శకుడిగా అనిల్ రావిపూడి కనిపిస్తాడు. 'పటాస్' .. 'సుప్రీమ్' .. 'రాజా ది గ్రేట్' .. 'ఎఫ్ 2' సినిమాల్లోని కామెడీ ఎపిసోడ్స్ ను ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. ఆ కామెడీ ఎపిసోడ్స్ ఆ సినిమాల విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతోనూ .. కొరటాల శివ 'ఆచార్య' సినిమాతోను .. అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' పనులతోను బిజీగా ఉన్నారు. ముగ్గురూ దర్శకులే అయినా వారి దారి వేరు .. వారి తీరు వేరు. కెరియర్ ను మొదలుపెట్టి చాలాకాలమే అయినా ఇంతవరకూ అపజయమనేది ఎరుగకపోవడం విశేషం. ఈ కారణంగానే అగ్రకథానాయకులు .. అగ్ర నిర్మాతలు వాళ్లతో సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు .. వాళ్లు అడిగినంత సమయాన్ని అభ్యంతరం లేకుండా ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ చేస్తున్న ప్రతి ప్రాజెక్టుపై అంచనాలు ఉన్నాయి .. వచ్చే ఏడాది కూడా వాళ్లను విజయాలే వరిస్తాయనడంలో సందేహం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృషి .. పట్టుదల .. కార్యదీక్ష కలిస్తే ఈ ముగ్గురు దర్శకులు. వాళ్లు వరుస విజయాలను అందుకోవడానికి ప్రధమ కారణం .. ప్రధాన కారణం .. ప్రతి సినిమాను వాళ్లు ఒక యజ్ఞంలా మొదలుపెట్టి .. ఒక తపస్సులా పూర్తి చేయడమే.

మరింత సమాచారం తెలుసుకోండి: