బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎన్టీఆర్ పౌరాణికం, జానపదం, సాంఘికం, చారిత్రాత్మక పాత్రలలో నటించి అశేష ప్రేక్షకాదరణ పొందారు. ఇక రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన సేవలు అశేషం.ఇక తెలుగుజాతి వాడిని, వేడిని, పౌరుషాన్ని, తెగువని ప్రపంచపు నలుమూలలా చాటిచెప్పి.. కులం, మతం, ప్రాంతం మరియూ రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఘనత ఒక్క 'ఎన్‌.టి.ఆర్‌'కే సాధ్యం అయింది..అలాంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారి 25వ వర్ధంతి నేడు.. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయనను స్మరించుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించారు. సమాధి వద్ద తండ్రికి నివాళులు అర్పించిన బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కీర్తిని ఆయన కొనియాడారు.సాధారణ రైతు కుటుంబంలో పుట్టి చిత్ర పరిశ్రమపై మక్కువతో మద్రాసు వెళ్లిన ఎన్టీఆర్, అద్భుతమైన పాత్రలు చేసి ట్రెండ్ సెట్ చేశారు అన్నారు. తిరుగులేని కథానాయకుడిగా ఎదిగిన ఎన్టీఆర్, ప్రజలకు మేలు చేయాలనే తపనతో రాజకీయాలలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేశారు అన్నారు.తెలుగువారి ఆత్మ గౌరవం ప్రపంచం నలుమూలలకు చాటిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు.ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే ఆవేశం వస్తుందని, ఎన్టీఆర్ పుట్టాకే ఆవేశం పుట్టిందని బాలయ్య చెప్పడం విశేషం.

ఎందరో మహానుభావులు తెలుగు గడ్డపై జన్మించగా... వారి సరసన ఎన్టీఆర్ ఉంటారు అన్నారు. ఎన్టీఆర్ కి భారత రత్న వచ్చే వరకు పోరాడుతాం అని బాలయ్య చెప్పడం జరిగింది...ఇక నందమూరి తారకరామారావు మనవళ్లు అయిన జూనియర్ ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లు తమ ట్విట్టర్ ద్వారా తమ తాతని స్మరించుకున్నారు. తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ.. ధ్రువ తార మీరే అంటూ కామెంట్ చేశారు.. 1996 జనవరి 18న ఎన్టీఆర్ తన నివాసంలో గుండెపోటుతో మరణించారు..ఇక ఈ రోజు (అనగా జనవరి 18) ఆయన 25 వ వర్ధంతి వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, అన్నగారి అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహించారు..!!




మరింత సమాచారం తెలుసుకోండి: