కరోనా భారతదేశంలో విపరీతంగా ఉండడంతో అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సినిమా పరిశ్రమలు వారి షూటింగులను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్ర లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో బాలీవుడ్ కి చెందిన పలువురు నటీనటులు కరోనా ప్రమాదం లేని ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ ప్రాంతాలలో మాల్దీవ్స్ కూడా ఒకటి. ఇక్కడ అన్ని రకాల వసతులు ఉండడంతో ప్రపంచం నలువైపుల నుండి ఇక్కడకు వచ్చే వారి సంఖ్య ఎక్కువయింది. ఈ నేపథ్యంలో రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ కూడా ఇటీవల మాల్దీవ్స్ కి వెళ్ళింది. మాల్దీవ్స్ లో ఇండియా వారికి ప్రత్యేక నిబంధనలు విధిస్తారు అని తెలియడంతో ముందుగానే ముంబైకి తిరిగొచ్చేసింది.

ఇక్కడకు వచ్చిన తరువాత కరోనా రోగులు పడుతున్న కష్టాలను చూసి ఆమె చలించిపోయారు. అంతే కాకుండా కొంతమంది రోగులు అయితే మాకు ఆక్సిజన్ దొరకడం లేదు, వెంటిలేటర్స్ దొరకడం లేదు, బెడ్స్ దొరకడం లేదు, వ్యాక్సిన్ దొరకడం లేదు అంటూ పలు విధాలుగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖులను కోరుకుంటున్న నేపథ్యంలో చాలా మంది ముందుకు వచ్చి వారికి అవసరమైనవి కల్పిస్తున్నారు. ఇప్పటికే సోను సూద్ ఎప్పటిలాగే తన సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తెలుగు హీరో నిఖిల్ ఒకరికి రెండేసివెర్ ఇంజక్షన్ ను ఏర్పాటు చేసిన తన ఉదారతను చాటుకున్నాడు. బాలీవుడ్ టెలివిజన్ నటుడు గుర్మీత్ చౌదరి ఏకంగా 1000 బెడ్స్ కలిగిన హాస్పిటల్ ను నిర్మిస్తానని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.

తాప్సీ, స్వరా భాస్కర్, భూమి పెడ్నేకర్ మరియు సోనాల్ చౌహాన్ తదితరులు కరోనా రోగులకు సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుండి కూడా ప్రముఖ నటీనటులు సీఎం సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి సీసీసీ అనే సంస్థ ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. దీనితో అలియా భట్ కూడా కోవిడ్ రోగులకు తన శక్తి మేరకు సహాయం చేస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కరోనా రోగుల కుటుంబాల నుండి రిక్వెస్ట్ లను తీసుకుంటున్నామని తెలిపింది. ఈమె నటి మరియు జర్నలిస్ట్ ఫయే డిసౌజాతో కలిసి అవసరమైన బాధితులను గుర్తించి సహాయమందించనుంది. ఇలా ఎంతోమంది ముందుకు వచ్చి తమ మంచి మనస్సును చాటుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి కష్ట సమయంలో మన తోటి కరోనా రోగులకు మనకు తోచిన సహాయాన్ని అందిద్దాము.

 

మరింత సమాచారం తెలుసుకోండి: