సినిమా టికెట్ల ధ‌ర‌లు త‌గ్గిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వివాదానికి దారి తీసిన‌ది. దీని ఎఫెక్ట్ థియేట‌ర్ల‌పై ప‌డుతున్న‌ది. ఇప్పుడు ఏపీలో సినిమా థియేట‌ర్లు వ‌రుస‌గా మూసివేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ప్ర‌భుత్వం జీవో 35 తో సినిమా టికెట్ల ధ‌ర‌లు భారీగా త‌గ్గించాల్సి వ‌చ్చిన‌ది. థియేటర్ల నిర్వ‌హ‌ణ భారంగా మారిన‌ద‌ని, ఆర్థిక ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని, థియేట‌ర్ య‌జ‌మానులు వాపోతున్నారు. కొంద‌రూ మ‌రొక దారి లేక‌పోగా థియేట‌ర్ల‌ను స్వ‌చ్ఛందంగా మూసేస్తున్నారు.

తాజాగా ఏపీలో ఉన్న‌టువంటి బాహుబ‌లి థియేట‌ర్ ఇవాళ మూత‌ప‌డింది. నెల్లూరు జిల్లా సూళ్లురుపేట‌లో V-EPIQ మ‌ల్టిప్లెక్స్ థియేట‌ర్ మూసివేసారు. నూత‌నంగా టికెట్ విధానానికి నిర‌స‌న‌గా మ‌ల్టీప్లెక్స్ కు నిర్వాహ‌కులు తాళం వేసారు. ఇది గ్రామ‌పంచాయ‌తీలో ఉండ‌డంతో టికెట్ల రేట్లు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని, త‌గ్గిన టికెట్ ధ‌ర‌ల‌తో థియేట‌ర్ల‌ను  న‌డుప‌లేము అని, సినిమా హాల్ కు తాళం వేసి మూసేసారు. దేశంలోనే అతిపెద్ద స్క్రీన్ గా V-EPIQ మ‌ల్టీ ప్లెక్స్‌కు పేరున్న‌ది. బాహుబ‌లి థియేట‌ర్‌గా దీనిని పేర్కొంటున్నారు. ప్ర‌స్తుతం నాచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ సినిమా న‌డుస్తోంది. టికెట్ రేట్ల‌ను భారీగా త‌గ్గించ‌డంతో చేసేదేమీ లేక థియేట‌ర్‌ను తాత్కాలికంగా మూసివేసిన‌ట్టు యాజ‌మాన్యం ప్ర‌క‌టించిన‌ది.

 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి థియేట‌ర్ నిర్మించిన‌ప్ప‌టికీ.. ఈ థియేట‌ర్ గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలో ఉండ‌డంతో.. ఏపీ ప్ర‌భుత్వం చెప్పిన ధ‌ర‌ల‌కు సినిమా టికెట్లు అమ్మాల్సి వ‌స్తే.. న‌ష్టం వాటిల్లుతుంది. గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలో ఉన్న థియేట‌ర్ల‌కు ప్రీమియం 80, డీల‌క్స్ 50, ఎకాన‌మీ 30 ఫిక్స్ చేసిన‌ది. ఆ రేట్ల‌కు టికెట్లు అమ్మ‌డం కంటే.. థియేట‌ర్ మూసివేయ‌డం వ‌ల్ల వచ్చే న‌ష్టాలు త‌క్కువ అని, యాజ‌మాన్యం భావించి.. మూసివేసిన‌ట్టు ప్ర‌క‌టించింది యాజ‌మాన్యం. మ‌రోవైపు రెండు తెలుగు రాష్ట్రాల‌లో సినిమా టికెట్ల వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపుపై విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా.. తెలంగాణ‌లో టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తిని ఇచ్చిన‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి: