తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్
హీరో వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1999లో వచ్చిన స్వయంవరం సినిమాతో హీరోగా పరిచయమై దాని తర్వాత చిరునవ్వులతో పెళ్ళాం ఊరెళితే వంటి సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఆ తర్వాత కొంత కాలానికి సినిమాలు చేయడం మానేశాడు. దానికి కారణాలేంటో తెలియకపోయినా మళ్ళీ అప్పుడెప్పుడో ఎన్టీఆర్ 'దమ్ము' సినిమాలో కీలక పాత్ర పోషించి మళ్లీ చాలా గ్యాప్ తీసుకుని గత ఏడాది రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఆ సినిమా ప్లాప్ అయినా వేణు క్యారెక్టర్ కి మంచి మార్పులే పడ్డాయి. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ లతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు తన తోటి హీరో వడ్డే నవీన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మీ సినీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? అని అడిగిన ప్రశ్నకు వేణు బదులిస్తూ. " నేను, వడ్డే నవీన్, సిమ్రాన్, సింగర్ సునీత భర్త మ్యాంగో రామ్ ముంబైలో ఫిలిం ఇన్స్టిట్యూట్లో క్లాస్ మేట్స్. మ్యాంగో రామ్ మాత్రం మొదట్లో మాతో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత సినిమాలకు తను సూట్ అవ్వనని తెలుసుకొని వేరే ప్రొఫెషన్ ఎంచుకున్నాడు. ఆ ప్రొఫెషన్ లో ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆ విషయంలో రామ్ ని మెచ్చుకోవాలి. ఇక ఇన్సిట్యూట్ లో నేను అందరితో చాలా కలివిడిగా, సరదాగా ఉండేవాడిని. కానీ వడ్డే నవీన్ మాత్రం అలా కాదు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. నేను తెలుగు వాడినైనా నాతో ఎందుకు మాట్లాడట్లేదు? అని నేను అనుకునేవాడిని. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. కానీ తెలుగు వాడ్ని అయ్యుండి నాతోని ఎందుకు మాట్లాడట్లేదు అనే సందేహం మాత్రం నాకు వచ్చింది. మనం మాట్లాడితే మాట్లాడుతాడు, కానీ తనే వచ్చి ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. నాకంటే వడ్డే నవీన్ రెండు నెలలు సీనియర్. నాకన్నా ముందే ముంబై ఇన్సిట్యూట్ లో జాయిన్ అయ్యాడు. అలా వడ్డే నవీన్ నాకు పరిచయం" అంటూ తెలిపారు.