తమిళ సినీ పరిశ్రమను కడుపుబ్బా నవ్వించిన నటుడు మదన్ బాబు ఇక లేరు. 71 ఏళ్ల వయసులో, క్యాన్సర్‌తో కొంతకాలంగా పోరాడుతున్న మదన్ బాబు శనివారం (ఆగస్టు 2) సాయంత్రం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త సినీ అభిమానులను, కళాకారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణంతో తమిళ ఇండస్ట్రీ  శూన్యంగా మారంది ..  వందలాది సినిమాల్లో తన నటనతో నవ్వులు పూయించిన మదన్ బాబు అసలు పేరు ఎస్. కృష్ణమూర్తి. తమిళ చిత్రసీమలో మంచి గుర్తింపు పొందిన ఆయన, రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, మాధవన్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ పంచుకున్నారు. ముఖ్యంగా "తెనాలి", "రన్", "ఫ్రెండ్స్", "మిస్టర్ రోమియో", "జెమినీ", "లింగ", "రాయన్" వంటి పాపులర్ సినిమాల్లో కామెడీ  పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు.
 

ఈ సినిమాలన్నీ తెలుగులోకి డబ్ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లోకూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన కామెడీ టైమింగ్, శరీర భాష, యాక్సెంట్‌తోనే కాకుండా, మానవీయతతో కూడిన పాత్రల ద్వారా మదన్ బాబు అభిమాన హృదయాల్లో స్థానం ఏర్పరుచుకున్నారు. టీవీ రంగంలోనూ తన సత్తా చాటిన ఆయన, పలు కామెడీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. నటనతో పాటు సంగీతంపై ఆసక్తి కలిగిన మదన్ బాబు ఒక మంచి కీబోర్డ్ ప్లేయర్ కూడా. తెలుగులో పెద్దగా సినిమాల్లో నటించకపోయినా, పవన్ కల్యాణ్ నటించిన "బంగారం" సినిమాలో కనిపించి అలరించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.



మదన్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా – “మేము కలిసి పని చేశాం, ఆయన సెట్స్‌లో ఎప్పుడూ చుట్టుపక్కలవాళ్లను నవ్వించే వ్యక్తి. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ చేశారు. ఈ రోజు చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మదన్ బాబు ఇక లేరు కానీ, ఆయన నవ్వులు, హాస్య పండుగలు ఎప్పటికీ మిగిలిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ లోకం ప్రార్థిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: