"విజయ్ భాస్కర్:..  ఈ కాలం జనాలకు ఈయన పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ 1980ల వారికి మాత్రం ఈ పేరు బాగా సుపరిచితమే. సినిమా రంగంలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమా స్టార్లతో ప్రత్యేక సంబంధం కొనసాగించిన డైరెక్టర్లలో విజయ్ భాస్కర్ కూడా ఒకరు. ఆయన తెరకెక్కించిన సినిమాలు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌గానే కాకుండా, ప్రతి మనిషిని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. అలాంటి ఎన్నో సినిమాలు తన ఖాతాలో వేసుకున్న ఆయన, చిరంజీవి, నాగార్జునతో పాటు అనేకమంది యంగ్ హీరోలతో విజయవంతమైన సినిమాలు చేశారు.అయితే బాలకృష్ణతో మాత్రం సినిమా చేసే అవకాశం వచ్చినా, అది చేజారిపోయిందని ఆయన తెలిపారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని ఆయన వెల్లడించారు.


విజయ్ భాస్కర్ మాట్లాడుతూ — “నేను తెలుగు సినిమాల్లో బి. గోపాల్‌ గారి వద్ద లారీ డ్రైవర్ సినిమాకు లాస్ట్ అసిస్టెంట్‌గా పని చేశాను. అది ఒక్క షెడ్యూల్ మాత్రమే అనుకుంటాను. ఆ సినిమాలో హీరో బాలకృష్ణ గారు, హీరోయిన్ విజయశాంతి గారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో మాతో సరదాగా మాట్లాడిన సందర్భాలు అన్నీ నాకు గుర్తున్నాయి. లారీ డ్రైవర్ షూటింగ్ విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో జరుగుతున్న సమయంలో నారీ నారీ నడుమ మురారి సినిమా విడుదలైంది. దాన్ని చూసి నాకు ఎంత బాగా నచ్చిందో బాలకృష్ణ గారికి చెప్పాను. ఆ తర్వాత లారీ డ్రైవర్ షూటింగ్ పూర్తయ్యేలోపే నాకు "ప్రార్థన"  సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.దానితో బి. గోపాల్‌ గారి వద్ద పర్మిషన్ తీసుకుని, ప్రార్థన సినిమా చేయడానికి వెళ్లిపోయాను. ఆ సినిమాను గుంటూరులో సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేశాం. ఓ పాటను చెన్నైలో చిత్రీకరించాం. సినిమా ఫస్ట్ కాపీ వచ్చాక, లారీ డ్రైవర్ షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలకృష్ణ గారిని కలసి ‘ఓ సినిమా చేశాను, చూడండి’ అని అడిగాను. అప్పుడే ఆయన ఆశ్చర్యపోయి, చెన్నైలో చోళ షరట్ దగ్గర హేమ వాళ్ల ప్రీవ్యూ థియేటర్‌లో ప్రార్థన సినిమా చూశారు. చూసిన తర్వాత చాలా బాగుందని, మంచి సినిమా తీశావు అని మెచ్చుకున్నారు. ‘ఇంకా పది లక్షలు ఖర్చు పెట్టి ఉంటే మరింత గ్రాండ్‌గా ఉండేది’ అని నా భుజం తట్టి అభినందించారు,” అని చెప్పారు.



ఇక బాలకృష్ణతో మిస్ అయిన సినిమాపై మాట్లాడుతూ — “త్రివిక్రమ్‌తో కలిసి మల్లీశ్వరి శ్రీనివాస్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న సమయంలోనే బాలకృష్ణ గారితో సినిమా చేసే అవకాశం వచ్చింది. అప్పుడు  నిర్మాత ఎం.ఆర్.వి. ప్రసాద్ గారు ఓ సినిమా చేద్దాం అని చెప్పారు. బాలకృష్ణ గారు స్వయంగా ఫోన్ చేయడంతో ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను. త్రివిక్రమ్‌కి ఈ విషయం చెప్పగానే ఆయన కూడా చాలా సంతోషించారు. కానీ ముందుగా ఒప్పుకున్న మల్లీశ్వరి పూర్తి చేయాల్సి ఉండటంతో ఆ అవకాశం వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత మేము మరో సినిమాకి కమిట్ అయ్యాం. ఆ సమయంలో బాలకృష్ణ గారికి తగ్గ సబ్జెక్ట్ మా దగ్గర రెడీగా లేదు. కథ కొత్తగా తయారు చేయాలి. పైగా బాలకృష్ణ గారితో సినిమా అంటే కచ్చితంగా గ్రాండ్‌గా, ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ మాస్ కమర్షియల్ కామెడీగా ఉండాలి అనుకున్నాను. కానీ ఆయన డేట్స్ వృథా అవుతాయనే ఉద్దేశ్యంతో, ఆ సమయంలో జయంతి అల్లరి పిడుగు సినిమా తీసేశారు. అలా బాలకృష్ణ గారితో సినిమా చేసే అవకాశం మిస్ అయిపోయింది,” అని విజయ్ భాస్కర్ తెలిపారు. “బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఉంది — అది నా తీరని మిగిలిపోయిన కల” అంటూ ఆయన ఎమోషనల్‌ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: