ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే సినిమా ప్రమోషన్స్ విధానం పూర్తిగా మారిపోయింది. పాత రోజుల్లో సినిమా రిలీజ్‌కి ముందు ప్రెస్‌మీట్స్, ఆడియో ఫంక్షన్స్, ఇంటర్వ్యూలతో పరిమితమైన ప్రమోషన్‌లు ఇప్పుడు పూర్తిగా డిజిటల్‌ ఆధారితంగా, సోషల్ మీడియా సెంట్రిక్‌గా మారాయి. కానీ ఇటీవలి కాలంలో మూవీ మేకర్స్ మరో కొత్త దారిని ఎంచుకున్నారు — కాంట్రవర్సీ ప్రమోషన్స్! ఇప్పుడు చాలామంది దర్శకులు, నిర్మాతలు, హీరో–హీరోయిన్లు తమ సినిమాకి హైప్‌ క్రియేట్‌ చేయాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూల్లో లేదా ఈవెంట్స్‌లో బోల్డ్‌ స్టేట్‌మెంట్స్‌ చేస్తూ, పర్సనల్‌ లైఫ్‌ విషయాలను బయటపెడుతూ, మీడియాతో వాగ్వాదాలు చేస్తూ ఉండడం ఒక సాధారణ విషయంగా మారిపోయింది. సినిమాకి సంబంధం లేని విషయాలను కూడా ప్రస్తావిస్తూ, “వైరల్‌ కావాలి” అనే ఉద్దేశంతో పలు వ్యాఖ్యలు చేస్తుంటారు.


ఇటీవల దీనికి ఉత్తమ ఉదాహరణగా నిలిచిన ఘటనలు మనమందరం చూశాం. కోలీవుడ్‌ యంగ్‌ హీరో ప్రదీప్‌ ని జర్నలిస్ట్‌ అడిగిన సాదాసీదా ప్రశ్నను మిగతావాళ్లు పెద్ద సమస్యగా మార్చేసారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. దాంతో ఆయన లుక్స్‌పై, స్పందనలపై డిబేట్స్‌ మొదలయ్యాయి. అదే అంశాన్ని టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం కూడా తన ఈవెంట్‌లో ప్రస్తావించడంతో అది మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. మీడియాలో ప్రశ్నలు వేసే విధానం సరైనదా కాదా అనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగింది.



ఇప్పుడు అదే దారిలో సిద్దు జొన్నలగడ్డ కూడా నడిచారు. ఒక ఈవెంట్‌లో మైక్ పట్టుకుని ఆయన మీడియాపై చేసిన కౌంటర్‌ వ్యాఖ్యలు చక్కర్లు కొడుతున్నాయి. “మీడియా అంటే మైక్‌ పట్టుకుని ఏదంటే అది మాట్లాడే హక్కు కాదు” అంటూ ఘాటుగా స్పందించారు. దాంతో సోషల్‌ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై విభిన్న స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు మీడియా ప్రతినిధులు “సినిమా ప్రమోషన్ కోసం మమ్మల్ని పిలుస్తారు, కానీ మేము ప్రశ్నలు అడిగితే రివర్స్‌ కౌంటర్‌ వేస్తే ఎలా?” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం, మీడియా సమాజానికి మధ్యవర్తిగా ఉంటుంది. ప్రజలకు సందేహాలు ఉంటే వాటిని సెలబ్రిటీల దగ్గర నుంచి క్లారిటీ తీసుకురావడమే మీడియా పని. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలకు బదులుగా తిప్పి అరిస్తే, అది సరైన ధోరణి కాదని స్పష్టం చేస్తున్నారు.



మరోవైపు, కొంతమంది నెటిజన్లు మాత్రం “మీడియా కూడా అతి చేయకూడదు, ప్రశ్నలు అడగడానికి ఒక లిమిట్‌ ఉండాలి” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అందువల్ల సోషల్‌ మీడియాలో ఇప్పుడు “మీడియా వర్సెస్ మూవీ మేకర్స్” అనే చర్చ హాట్ టాపిక్‌గా మారిపోయింది.ఇక వీటన్నింటి ఫలితంగా సినిమాకి సంబంధించిన అసలు కంటెంట్‌ కన్నా ఈ కాంట్రవర్సీలు, రివర్స్‌ కౌంటర్లు, వైరల్‌ వీడియోలే ఎక్కువగా ప్రాధాన్యం పొందుతున్నాయి. ఎవరి సినిమా రిలీజ్‌ కంటే ముందు ఎలాంటి వాగ్వాదం జరుగుతుందా అని నెటిజన్లు ఎదురు చూస్తున్నారు. ఇది క్రమంగా “ప్రమోషన్‌ టెక్నిక్‌”గా మారిపోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.మొత్తం మీద, ఈ కొత్త ట్రెండ్‌ వల్ల సినిమా ప్రమోషన్స్‌ ఒకప్పుడు ఉన్న క్లాసీ రూపం కోల్పోయి, కాంట్రవర్సీ సెంటర్డ్‌ మార్కెటింగ్‌గా మారిపోతోందనే చెప్పాలి. మీడియా–మూవీ మేకర్స్ మధ్య ఈ “పోరు” ఇంకా ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: