పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ‘దండోరా’ సినిమా టీజర్ ఈవెంట్‌లో పాల్గొన్న శివాజీ, రవి వ్యక్తిత్వం, అతని ప్రతిభ, అలాగే ఇండస్ట్రీపై అతను చూపిన ప్రభావం గురించి విస్తృతంగా మాట్లాడారు.ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ—“ఇమ్మడి రవి ఎంత తెలివైన వ్యక్తినో అందరికీ తెలిసిందే. అతడు చేసిన పని చట్టపరంగా తప్పే కావచ్చు. కానీ అతనిలో దాగి ఉన్న ప్రతిభ అసాధారణం. అలాంటి టాలెంట్ దేశానికి ఉపయోగపడేలా మార్చుకోవాలి. మంచి మార్గంలో నడిస్తే రవి ఇండియాకు ఓ విలువైన ఆస్తిగా మారగలడు” అని అభిప్రాయపడ్డారు.


శివాజీ మరింత వివరంగా చెబుతూ—“సినిమాలను ప్రజలకు అందించడం ద్వారా రవి ఒక విధంగా ఆనందపడిపోయాడు. కానీ అతను చేసిన పని వల్ల ఇండస్ట్రీ భారీగా నష్టపోయింది. మన రాజ్యాంగం ప్రకారం, అతడు చట్టాలను గౌరవించి నడిస్తే అతని భవిష్యత్తు ఎంతో వెలుగులు చూడగలదు. ఇప్పటికైనా రవి తన పనులు, తన ఆలోచనలు మార్చుకుని సమాజానికి ఉపయోగపడే మార్గాన్ని ఎంచుకుంటాడని నేను ఆశిస్తున్నాను” అని తెలిపారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది శివాజీ మంచితనం అని కొందరు అంటుంటే..మరికొందరు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.


ఇక ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ—“మొబైల్‌లో సినిమాలు చూడటం ఒక అలవాటైపోయింది. కానీ సినిమా థియేటర్‌లో చూసే అనుభవానికి ఏమాత్రం సాటి లేదు. ఒక సినిమా వెనుక ఎంత మంది కష్టపడతారో ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. సినిమా ఇండస్ట్రీ నిలబడాలంటే థియేటర్లకు రావాలి, సినిమాకు విలువ ఇవ్వాలి” అని విజ్ఞప్తి చేశారు.'దండోరా' సినిమాలో శివాజీ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన టీజర్ ఈవెంట్‌ రవి విషయం ప్రస్తావనతో మరింత హీటెక్కింది. శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: