దేశంలో ఏదైనా ఒక్క విషయం కొంచెం హైలైట్ అయితే చాలు… దాని మీద సినిమాలు రావడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. బాంబ్ బ్లాస్ట్ జరిగినా, టెర్రరిస్ట్ అరెస్టయినా, సెలబ్రిటీ ఒక వివాదంలో ఇరుకున్నా… ఆ అంశంపై ప్రజల్లో ఉండే ఆసక్తిని సినిమా మేకర్స్ సద్వినియోగం చేసుకుంటారు. ఈ విషయంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ముందు వరుసలో ఉంటారు. ఆయన ఎన్నో కథలను వెండి తెరపై చిత్రీకరించారు. ఇదే ఫార్ములా ఇప్పుడు కొత్త దిశలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఐ బొమ్మ పేరుతో నడిచిన పైరసీ ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన ఈమంది రవి అరెస్ట్ విషయంపై వార్తలు, చర్చలు ఇండస్ట్రీని ఎంతగానో షేక్ చేశాయి. పైరసీ కారణంగా నష్టం చూశామని సినీ పెద్దలు ఎప్పటి నుంచో చెబుతుండగా, ఈ అరెస్ట్‌తో “ఇండస్ట్రీకి మంచిరోజులు వస్తాయేమో” అని పలువురు పేర్కొంటున్నారు.
మరోవైపు, సోషల్ మీడియాలో మాత్రం పూర్తిగా భిన్నమైన స్పందన కనిపించింది. సినిమా టికెట్ రేట్లు పెరగడంతోనే చాలా మంది ఇలాంటి సైట్లకు అలవాటు పడ్డారని, రవిని ‘ తమకు దేవుడు ’ లా చూపిస్తూ కొందరు కామెంట్లు చేయడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో, రవి వ్యక్తిగత జీవితంపై మీడియాలో వినిపించిన కథలు అవమానాలు , భార్య , అత్త పెట్టిన ఒత్తిళ్లు వంటి అంశాలు చాలామందిని భావోద్వేగానికి గురి చేశాయి. దీంతో “ ఈమంది రవి జీవితం సినిమాలో చూపించడానికి ఏ మాత్రం తగ్గదు ” అనే అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. బయోపిక్ రాబోతుందంటూ నెటిజన్స్ కూడా మాట్లాడుకుంటుండగా, ఆ ఊహాగానాలకు నిజం పలికేలా ఒక బ్యానర్ ముందుకు వచ్చింది.
తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థ, రవిపై బయోపిక్ రూపొందిస్తున్నామని అధికారికంగా ప్రకటించింది. ఆయన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలన్నింటినీ ఇందులో చూపించనున్నామని వెల్లడించారు. అయితే ఈమంది రవి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు ? దర్శకుడు ఎవరు ? వంటి కీలక వివరాలను త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి