- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తమిళ సినీ పరిశ్రమలో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండే స్టార్ హీరో ధనుష్ మళ్లీ ఒక వివాదంలో చిక్కుకున్నట్లు మీడియాలో చర్చ నడుస్తోంది. ఈసారి ప్రముఖ టీవీ నటి మాన్యా ఆనంద్ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవలి ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఓ ప్రముఖ దర్శకుడి సినిమాలో కీలక పాత్ర కోసం ధనుష్ మేనేజర్‌గా చెప్పుకున్న‌ శ్రేయాస్ తనను సంప్రదించాడని మాన్యా పేర్కొన్నారు. మొదట మంచి ఛాన్స్‌ భావించి సంతోషించిన ఆమె, తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం తనను పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేశాయని చెప్పారు.


 “ పాత్ర కోసం కొన్ని కమిట్‌మెంట్‌లు ఇవ్వాలి, ధనుష్‌తో అడ్జస్ట్మెంట్ అవ్వాలి ” అని అడ‌గ‌డంతో షాక్ అయ్యానని వెల్లడించింది. ఇది తనపై ఒత్తిడి తీసుకువచ్చినట్లుగా అనిపించడంతో వెంటనే దూరంగా ఉండిపోయానని మాన్యా తెలిపారు. ఈ అనుభవం తానెప్పటికీ మర్చిపోలేనని, ఇలాంటి ఒత్తిళ్లు సినీ పరిశ్రమలో ఇప్పటికీ కొనసాగుతుండటం బాధకరం అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఈ సంఘటన నిజంగా ఎప్పుడు జరిగింది ? ఏ సినిమా సందర్భంలో చోటుచేసుకుంది? ప్రస్తుతం ఎందుకు బయటపెడుతున్నారు ? అనే కీలక ప్రశ్నలకు మాత్రం మాన్యా సమగ్ర సమాధానం ఇవ్వలేదు. తాను ఇప్పుడు మాట్లాడటానికి కారణం .. కొత్తగా వస్తున్న నటీమణులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు భయంతో మాట్లాడలేకపోవడం, కనీసం తనలాంటి వారు ఎదురు నిలిస్తే పరిశ్రమలో ఉన్న లోపాలు బయటకు వస్తాయని ఆమె తెలిపారు.


ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనేక రకాల చ‌ర్చ‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. కొందరు నెటిజన్స్ మరియు టీవీ నటీమణులు మాన్యా ధైర్యానికి మద్దతు తెలుపుతూ, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తేవడం అవసరమని అంటున్నారు. మరోవైపు, కొందరు “ పూర్తి వివరాలు బయటకు రావాలి, ఒకే వైపు కథ విని నిర్ణయాలకు రావడం సరికాదు ” అని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ధనుష్, ఆయన ప్రతినిధులు లేదా మేనేజర్ శ్రేయాస్ ఈ ఆరోపణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ ఆరోపణలు నిజమా? లేక అపోహలా? అన్నది సంబంధిత పక్షాలు స్పందించేవరకు స్పష్టత రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మాన్యా చేసిన ఈ ఆరోపణలు టీవీ పరిశ్రమ, సౌత్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ రెండింట్లోనూ ప్రధాన చర్చాంశంగా మారాయి. ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో, ధనుష్ టీమ్ ఎప్పుడు స్పందిస్తుందో అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: