ఓటీటీలో సందడి చేసిన వెబ్ సిరీస్‌లలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఎప్పుడూ ముందువరుసలో నిలుస్తుంది. తెలుగు, హిందీ ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్‌కు అలవాటు పడుతున్న సమయంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 1’ విడుదలై అందరినీ ఆశ్చర్యపరిచింది. అంచనాలు లేకుండా సిరీస్ చూస్తూ మొదలుపెట్టిన వారికి, ఇది కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన అద్భుత అనుభూతిని ఇచ్చింది. రాజ్ & డీకే రూపొందించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో మాత్రమే కాదు, దేశంలో అత్యుత్తమ యాక్షన్–థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. తరువాత వచ్చిన ‘సీజన్ 2’ మరింత వినోదాన్ని, మరింత థ్రిల్‌ను అందించింది. ముఖ్యంగా సమంత పోషించిన రాజీ పాత్ర అభిమానులను షాక్‌కు గురిచేసేలా చేసింది. ఇప్పుడు మూడోసారి మరింత ఉత్కంఠతో అలరించేందుకు ‘ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3’ నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చిరంజీవి వద్దకు వెళ్లిన కథ… ఎందుకు నిలిచిపోయింది?

ఏజెంట్ శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ బాజ్పాయిని కాక మరెవరినీ ఊహించలేం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఈ కథ మొదటగా చిరంజీవి వద్దకు వెళ్లిందట. రాజ్ & డీకే ఈ కథను వెబ్ సిరీస్‌గా కాకుండా ఒక సినిమాగా రాశారట. ఆ కథను నిర్మాత అశ్వనీదత్‌కి వినిపించగా, ఆయనకు బాగా నచ్చిందట. వెంటనే చిరంజీవిని కలిసి చెప్పగా, చిరుకి కూడా కథ నచ్చిందట. అయితే 'ఖైదీ నెంబర్ 150' విజయానంతరం ఇద్దరు పిల్లల తండ్రి పాత్రలో ప్రేక్షకులు తనను ఆమోదిస్తారా అన్న సందేహం చిరంజీవికి కలిగిందట. దాంతో ప్రాజెక్ట్‌పై ముందుకు వెళ్లలేమని భావించారు. రాజ్ & డీకే కథలోని పిల్లల పాత్రలను తీసివేసి మార్పులు చేయాలా అని ఆలోచించినా, చివరకు ఆ ఐడియా కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ కథ అక్కడే నిలిచిపోయింది.

చిరంజీవితో కథ కుదరనందున, దీనిని పూర్తిస్థాయి వెబ్ సిరీస్‌గా మార్చాలని రాజ్ & డీకే నిర్ణయించారు. మనోజ్ బాజ్పాయిని సంప్రదించాలనుకున్నారు. అయితే మొదట ఫోన్ చేయగా, వెబ్ సిరీస్‌లలో ఓవర్ శృంగారం, హింస ఉంటుందనే అభిప్రాయంతో "ఇలాంటి ప్రాజెక్ట్‌లు చేయను" అని మనోజ్ తిరస్కరించారట.రాజ్ & డీకే సన్నిహితులు, “మీరు అనుకున్న విధంగా ఇది ఉండదు… ఒకసారి వచ్చి కథ వినండి” అని ఒత్తిడి చేయడంతో, చివరకు మనోజ్ స్క్రిప్ట్ విన్నారు. కథ విన్న తర్వాత ఆయన అభిప్రాయం పూర్తిగా మారిపోయి, వెంటనే ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయంలోనే. శ్రీకాంత్ తివారీ పాత్ర ఆయన కెరీర్‌లో భారీ మలుపుగా మారి, జాతీయ స్థాయిలో మళ్లీ అతని స్థాయిని నిరూపించింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మనోజ్ బాజ్పాయిని కొత్త హైట్స్‌కు తీసుకెళ్లిన గేమ్ చేంజర్‌గా నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: