సినిమాల పైరసీ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టైన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవికు పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రవి భారీ స్థాయిలో పైరసీ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. పైరసీ ద్వారా అతడు కోట్లు విలువైన అక్రమ ఆదాయం సంపాదించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం, రవి దేశ–విదేశాల్లో వందలాది ఏజెంట్లను ఏర్పాటుచేసి, కొత్త సినిమాలు విడుదలైన వెంటనే వాటిని సీక్రెట్ నెట్‌వర్క్‌ ద్వారా సమీకరించి, వివిధ సర్వర్లకు అప్‌లోడ్ చేసేవాడు. అక్కడి నుంచి పైరసీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ ఛానెల్స్, ప్రైవేట్ గ్రూప్లు ద్వారా భారీగా డౌన్‌లోడ్‌లను సాధించి అక్రమ ఆదాయం రాబట్టేవాడు.


కోర్టు అనుమతితో కొనసాగుతున్న కస్టడీలో రవి విచారణను సులభంగా ముందుకు సాగనీయకుండా పోలీసులకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు సమాచారం. అడిగిన ప్రతీ ప్రశ్నకూ స్పష్టమైన జవాబు ఇవ్వకుండా, తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా, విదేశీ సర్వర్లు, యూకే మరియు కరేబియన్ దీవుల్లో ఉన్న టెక్నికల్ స్టాఫ్, అలాగే అతని డిజిటల్ లావాదేవీల గురించి అడిగిన ప్రశ్నలకు రవి జాగ్రత్తగా సమాధానాలు దాటవేస్తున్నాడని వెల్లడించారు. ఇదిలా ఉండగా, “ఈఆర్ ఇన్ఫో టెక్” పేరుతో రవి కొనుగోలు చేసిన డొమైన్‌కి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఈ డొమైన్ల ద్వారా అతడు నడిపిన వ్యాపారం, అలాగే పైరసీ నెట్‌వర్క్‌ ఆపరేషన్లపై వివరాలు సేకరించేందుకు సైబర్ నిపుణుల బృందం పని చేస్తోంది.



అదనంగా, రవి అరెస్టు అయ్యే ముందు తన ఫోన్, హార్డ్‌డిస్క్‌లు, లాప్‌టాప్‌లలో ఉన్న ముఖ్యమైన డేటాను డిలీట్ చేయడానికి ప్రయత్నించినట్లు కూడా దర్యాప్తులో బయటపడింది. ఈ డిలీట్ చేసిన ఫైళ్లను తిరిగి రికవర్ చేయడం కోసం ఫరెన్సిక్ టీములు కృషి చేస్తున్నాయి. డేటా రికవరీ జరిగితే పైరసీ ముఠాకు సంబంధించిన మరిన్ని కీలక వివరాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.కస్టడీ గడువు ముగిసిన నేపథ్యంలో, రవిని ఈ సాయంత్రం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. పరిశీలనలో ఉన్న డిజిటల్ ఆధారాలు, అంతర్జాతీయ నెట్‌వర్క్‌ వివరాలు, డబ్బు లావాదేవీలపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: