ప్రేక్షకులు సావిత్రిని దేవతలా ఆరాధించి ‘మహానటి’గా మంగళహారతులు పట్టారు. కానీ ఆమెకు దగ్గరి బంధువులమని, స్నేహితులమని చెప్పుకొనే కొంతమంది మాత్రం ఆమె ఆస్తులపై కన్నేశారు. కబళించారు. ఆమెను నెమ్మదిగా నైరాశ్యంలోకి నెట్టేశారు. నటనలో అపార ప్రతిభ కలిగిన ఈ మహిళ, నిజ జీవితంలో మాత్రం అమాయకురాలు. నమ్మకమే ఆమె బలం అయినా… అదే బలహీనతగా మారింది. దాదాపు 19 నెలలు కోమాలో ఉండి చివరకు కన్నుమూసిన సావిత్రి దేహాన్ని చూసి దర్శకుడు దాసరి నారాయణరావు కన్నీరుమున్నీరు గా విలపించారు. “ఏనాడో చచ్చిపోయింది తల్లి… ఇప్పుడిక ఆమెను సాగనంపుతున్నాం” అని రోదించారు. ఆచార్య ఆత్రేయ మాత్రం మరింత హృదయ విదారకంగా, “బతికినంత కాలం చస్తూ బతికింది… ఇప్పుడు నిజంగా బతుకుతుంది” అని నిట్టూర్చారు. ఏ జీవితం ఎలా ఉండకూడదో చెప్పడానికైనా, ఒక మనిషి పడకూడని మార్గం ఎలా ఉంటుందో తెలియజేయడానికైనా సావిత్రి జీవితం మహా పాఠశాల.
1937 డిసెంబర్ 6న గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో జన్మించిన సావిత్రి చిన్నతనం నుంచే కళలపై అపారమైన ఆసక్తి చూపింది. డ్రామాలు, నృత్యాలు, గానాలు—ఏ రంగంలోనైనా ఆమె ప్రతిభ కిరీటంలా మెరిసేది. అలా సినీరంగంలో అడుగు పెట్టిన ఆమె, కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను జయించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ—ఎదుట వచ్చిన ఏ భాషలోనైనా పాత్రకవసరమైన భావోద్వేగాలను అచ్చొచ్చినట్టుగా ప్రదర్శించే సామర్థ్యం సావిత్రికే ప్రత్యేకం.అయితే, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం పూర్తిగా భిన్న దిశగా సాగింది. జెమిని గణేశన్‌తో సినిమాలు చేస్తున్న మూమెంట్ లోనే అతనిపై ఆమెకు ప్రేమ పుట్టింది. శ్రేయోభిలాషులు హెచ్చరించినా… అప్పటికే వివాహితుడైన, పలు సంబంధాల్లో ఉన్న జెమినిని సావిత్రి గుడ్డిగా ప్రేమించింది. పుష్పవల్లి—అలియాస్ రేఖ తండ్రి అయిన జెమినికి అప్పటికే అనధికార కుటుంబం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా సావిత్రి ప్రేమ మాత్రం అజేయం. ఒక స్త్రీ పురుషుణ్ణి ఎంతగా ఆరాధించగలదో, ఎంతగా మమతను కురిపించగలదో సావిత్రి చూపించింది.
ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నా, అది ప్రపంచానికి తెలియకుండా ఉండాల్సిందే అనుకున్నారు. కానీ ఒక లక్స్ సబ్బు ప్రకటన పత్రంలో సావిత్రి ‘గణేశన్’ అని సంతకం చేయడంతో వారి వివాహం బయటపడిపోయింది. వారికి విజయ చాముండేశ్వరి, సతీష్ పుట్టారు.వివాహం తర్వాతే సావిత్రి జీవితంలో నిజమైన చీకట్లు మొదలయ్యాయి. జెమినీ గణేశన్ దూరమైపోవటం, అతని బంధువులు అవమానాలు చేయటం, ప్రేమ పేరుతో ఆమెని మానసికంగా చీల్చివేయటం—ఈ అన్ని బాధలను మర్చి బతకడానికి సావిత్రి మద్యం, నిద్ర మాత్రలు, మత్తు ఇంజెక్షన్లకు బానిస అయ్యింది. ఒకప్పుడు పెద్ద పెద్ద అరమానాల్లో నివసించిన ఆమె… చివరికి చిన్న గుడిసెకు చేరింది.
ఆ కష్టకాలంలో దర్శకుడు దాసరి నారాయణరావు మాత్రమే ఆమెకు అండగా నిలిచారు. ఆర్థిక సహాయం అందిస్తూ ఆమెను ఆదుకున్నారు.1980 మేలో బెంగుళూరు వెళ్లి హోటల్ చాణక్యలో బస చేసిన సావిత్రి, తీవ్ర మానసిక ఒత్తిడిలో విపరీతంగా మద్యం సేవించి స్పృహ కోల్పోయింది. కోమాలో పడిపోయిన ఆమెను బేరింగు ఆసుపత్రికి తరలించారు. అక్కడ 19 నెలలు కోమాలోనే గడిచాయి. శరీరం ఎముకల గూడులా మిగిలిపోయింది. ఆ తర్వాత మద్రాసులోని వెల్లింగ్టన్ ఆసుపత్రికి తీసుకువచ్చినా… కోలుకోలేదు.చివరకు 1981 డిసెంబర్ 26న, కేవలం 45 ఏళ్ల వయసులో, భారత సినీరంగం మహానటి సావిత్రిని శాశ్వతంగా కోల్పోయింది.
సావిత్రి జీవితం చెప్పేది ఒక్కటే —కళామహిమ ఎంత ఉన్నా, వ్యక్తిగత జీవితం గందరగోళమైతే మనిషి సంతోషాన్ని నిలబెట్టుకోలేడు.కానీ నటిగా ఆమె అమరత్వం పొందింది. ప్రతి తెలుగు మనసులోనూ ఆమె చిరస్మరణీయమైన వెలుగులా నిలిచిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి