రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా, 'ఉరి' చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ ప్రస్తుతం ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 1990ల నాటి కరాచీ ( పాకిస్థాన్ ) నేపథ్యంలో సాగే ఈ చిత్రం, కేవలం యాక్షన్ పరంగానే కాకుండా రాజకీయంగానూ పెద్ద చర్చకు దారితీసింది. ఈసినిమా రిలీజ్ అయిన అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్లకు చేరువలో ఉండటం విశేషం. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి భారీ తారాగణం ఉండటం, కథలో ఉన్న గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఈ స్థాయి విజయాన్ని అందించాయి. ఒక భారతీయ ఏజెంట్ పాకిస్థాన్‌లోని ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్ల నెట్‌వర్క్‌ను ఎలా ఛేదించాడనేది ఈ సినిమా కథాంశం.


సినిమాలో పాకిస్థాన్‌లోని లయరీ  ప్రాంతాన్ని ప్రధానంగా చూపించారు. ఈ నేపథ్యంలో, అక్కడి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మరియు కొందరు స్థానికులు వింత డిమాండ్లతో ముందుకు వస్తున్నారు: తమ ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కాబట్టి, ఆ వసూళ్లలో 50 % నుంచి 80 % వరకు తమకు ఇవ్వాలని వారు కోరుతున్నారు. డబ్బు ఇవ్వలేకపోతే, కనీసం తమ ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయినా నిర్మించాలని డిమాండ్ చేస్తూ చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.


పాక్‌లో నిషేధం.. కానీ పైరసీ సునామీ :
భారతీయ స్పై థ్రిల్లర్ కావడం మరియు పాకిస్థాన్‌ను వ్యతిరేకంగా చూపించారనే కారణంతో అక్కడి ప్రభుత్వం ఈ సినిమాను నిషేధించింది. అయితే: ఈ నిషేధాన్ని లెక్కచేయకుండా పాక్ జనం ఈ సినిమాను పైరసీ వెబ్‌సైట్ల ద్వారా విపరీతంగా చూస్తున్నారు. ఇప్పటికే అక్కడ 2 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్ జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. సినిమా లోని 'లయరీ' నేపథ్యంలో సాగే యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటలు అక్కడి యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా పాటలకు రీల్స్ చేస్తూ టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో హోరెత్తిస్తున్నారు. ఒకవైపు భారతీయ ఏజెంట్ విజయాన్ని చూపిస్తున్న ఈ సినిమాను పాక్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంటే, మరోవైపు తమ ప్రాంతం ప్రపంచస్థాయిలో పాపులర్ అయినందుకు అక్కడి జనం సంబరపడుతూ కలెక్షన్లలో వాటా అడగడం ఆశ్చర్యకరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: