నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మహిళల గురించి చేసిన వ్యాఖ్యలను ఉదాహరణగా ప్రస్తావించారు. అభిమానులు అడిగితే “అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి” అంటూ ఒక జాతీయ వేదికపై బాలకృష్ణ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో మహిళా కమిషన్ ఎక్కడికి పోయిందని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించని కమిషన్, ఇప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు.
ఇక జాతీయ మహిళా కమిషన్ పరిస్థితి ఏమైందని కూడా కేఏ పాల్ ప్రశ్నించారు. మహిళల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి పురస్కారాలు ఇస్తూ ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. బాలకృష్ణకు పద్మభూషణ్ ఇచ్చారని, వచ్చే ఏడాది భారతరత్న కూడా ఇస్తారని వ్యాఖ్యానిస్తూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే, ఉత్తరప్రదేశ్‌లో ఒక మాజీ బీజేపీ ఎమ్మెల్యే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసును ప్రస్తావించారు. ఆ కేసులో నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. బాధితురాలు తనకు ప్రాణహాని ఉందని చెప్పినా కూడా నిందితుడిని విడుదల చేశారని ఆయన మండిపడ్డారు. ఇది మహిళల భద్రతపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
శివాజీ బీజేపీని ప్రశ్నించి, కాంగ్రెస్‌ను ప్రశంసించినందుకే ఆయనను టార్గెట్ చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. బీజేపీలో చేరితే ఎన్ని కేసులు ఉన్నా అవన్నీ మాయమవుతాయని ఆయన విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్థకు ప్రమాదకర పరిస్థితి అని హెచ్చరించారు.దేశంలో ఛత్తీస్‌గఢ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో చర్చిలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మత స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని కేఏ పాల్ పిలుపునిచ్చారు. రాజకీయ లాభాల కోసం ప్రజలను విభజించకుండా, దేశాన్ని కాపాడే దిశగా అందరూ ఆలోచించాలని ఆయన అన్నారు. మహిళలకు న్యాయం, మైనారిటీలకు భద్రత, ప్రజలకు సమాన హక్కులు కల్పించడమే తన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి